Nayanthara | సూపర్స్టార్లకు జోడీగా సూపర్‌స్టారే ఉండాలి. అప్పుడే తెరకు నిండుదనం. నయనతార ఇంటికి నిర్మాతలు క్యూ కట్టేది కూడా అందుకే. షారుక్, రజనీకాంత్ లాంటి సూపర్స్టార్లకు సరైన జోడీ నయనతారే అని ఇప్పుడు చాలామంది దర్శక, నిర్మాతల భావన. అందుకే దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కూడా రీసెంట్గా నయనతారను కలిశారట. ‘స్పిరిట్’ కథ కూడా వినిపించాడట. ఆమెక్కూడా కథ, పాత్ర బాగా నచ్చాయని వినికిడి. ప్రభాస్ ‘స్పిరిట్’లో నయన్ నటించనున్నట్టు గతంలోనే వార్తలొచ్చాయి.
అయితే.. అందులో నిజం ఎంతుందో తెలీక, అది రూమర్‌గానే మిగిలిపోయింది. ఇప్పుడైతే ఆ వార్త గట్టిగానే వినిపిస్తున్నది. సాధారణంగా సందీప్‌రెడ్డి కథల్లో కథానాయిక పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. పాత్ర తీరుతెన్నులు కూడా కొత్తగా ఉంటాయి. అందుకే నయన్ జాక్‌పాట్ కొట్టేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 2007లో వచ్చిన ‘యోగి’ సినిమాలో ప్రభాస్‌తో జతకట్టింది నయనతార. ఇప్పుడు ‘స్పిరిట్’లో ఆమె నటిస్తే.. 17ఏండ్ల తర్వాత ప్రభాస్ తో నటించినట్టవుతుంది.