‘సలార్’ అపూర్వ విజయంతో అగ్ర హీరో ప్రభాస్ ఫుల్ జోష్‌మీదున్నారు. విడుదలైన వారం వ్యవధిలోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500కోట్ల మైలురాయిని దాటి రికార్డులు సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా అప్డేట్ వెలువడింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ‘డైనోసార్.. డార్లింగ్‌గా ఎలా మారాడో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది.
వినోదాత్మక, కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరున్న మారుతి..ఈ సినిమాలో ప్రభాస్‌ను సరికొత్త పంథాలో ప్రజెంట్ చేయబోతున్నారని అంటున్నారు. ప్రభాస్ ఇమేజ్‌కు తగిన పోరాట ఘట్టాలతో పాటు వినోదానికి పెద్దపీట వేస్తూ మారుతి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ ‘రాయల్’ ‘అంబాసిడర్’ అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే సంక్రాంతితో టైటిల్ సస్పెన్స్ వీడనుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.