Mayadari Maisamma | హైదరాబాద్‌లో బోనాల పండుగ వచ్చిందంటే వాడవాడలా వినిపించే పాట ‘మాయదారి మైసమ్మో.. మైసమ్మా.. మనం మైసారం పోదమే మైసమ్మా’! కానీ, అది విన్నప్పుడల్లా తన మనసు కకావికలం అవుతుందంటున్నారు ఆ పాట రచయిత, గాయకుడు క్లెమెంట్. బావామరదళ్ల మధ్య పరోక్ష సంభాషణలో సాగే ఈ పాట మూడు దశాబ్దాలు గడిచినా ఇంకా మార్మోగుతూనే ఉంది. అయితే, అమ్మవారి ఉత్సవాల్లో ఉపయోగించడమే బాధాకరమని చెబుతున్న క్లెమెంట్ ‘జిందగీ’తో పంచుకున్న అనుభవాలు…
‘మాయదారి మైసమ్మ..’ పాట పుట్టుక వెనుక ఒక కథ ఉంది. 1990లో హైదరాబాద్ ఆదర్శ్‌నగర్‌లోని విపంచి స్టూడియోలో దీన్ని రికార్డు చేశాం. మొదట రికార్డింగ్ కోసం ఓ గీత రచయిత వేరే సాహిత్యం ఇచ్చారు. నిర్మాతకు అది నచ్చలేదు. రికార్డింగ్ ఆలస్యం అవుతుందనే భావనలో ఉన్నారాయన. ఆ సమయంలో మాయదారి, పరేషాన్ తదితర పదాలతో ఫక్తు తెలంగాణ మాండలికంలో ఓ పాట రాసి నిర్మాతకు చూపించాను. ఆయనకు బాగా నచ్చడంతో అదే రికార్డు చేశాం. అలా పుట్టింది. అప్పట్లో క్యాసెట్లే ఉండేవి. పాట విడుదలకు ముందు చాలా కంగారుపడ్డాం. రిలీజయ్యాక ఊహించని స్పందన వచ్చింది. అప్పట్నుంచి ముప్పయ్ ఏండ్లుగా ఊరూరా మార్మోగుతున్నది. కానీ, సరదాగా సాగిపోయే ఈ పాటను అమ్మవారి ఉత్సవాల్లో వాడుతుండటమే బాధ కలిగిస్తున్నది.
పాట రాయడానికి పూర్తి స్వేచ్ఛ ఉండాలి. గతంలో నాకు సినిమా అవకాశాలు చాలా వచ్చాయి. అయితే, అక్కడ లెక్కలన్నీ డబ్బుల చుట్టే తిరుగుతుంటాయి. నాకది నచ్చదు. మనం రాసిన గీతాన్ని సినిమా వాళ్లు మార్చమని చెబుతారు. పాట రాసినా, పాడినా నాకు నచ్చినట్టు ఉండాలి. అందుకే సినిమాల్లో ప్రయత్నం చేయలేదు.
ఇప్పటికీ వైరల్..
నా వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే మా నాన్న రైల్వే ఉద్యోగి. సికింద్రాబాద్ లాలాగూడలో మా కుటుంబం ఉండేది. చిన్నప్పటి నుంచీ రకరకాల పాటలు రాస్తుండేవాణ్ని. ‘వాడికి పాటలు రాయడం అంటే ఇష్టం.. అదే దారిలో వెళ్లనిద్దాం’ అని మా నాన్నతో చెప్తుండేది అమ్మ. ఆమె ప్రోత్సాహంతో పాటలు రాయడం అలవాటైంది. స్కూల్లో ఉన్నప్పుడు ‘పెద్ద చిక్కు వచ్చినాదిరో.. నాకు ప్రేమ పుట్టినాదిరో..’ అని ఒక పాట రాశాను. మా ఉపాధ్యాయులు, దోస్తులు చాలా బాగుందని మెచ్చుకున్నారు. అప్పట్నుంచి పాటలు రాయడం నిత్యకృత్యమైంది. ఏదైనా సందర్భం చెబితే అప్పటికప్పుడు పాట రాసేస్తాను. అలా నాకు స్పాట్రైటర్ అన్న పేరొచ్చింది. అప్పట్లో రికార్డు చేయడం కష్టంగా ఉండేది. ఇప్పుడు నా పాటలు యూట్యూబ్ రీల్స్‌లో వైరల్ అవుతున్నాయి.
విలువ పెరిగింది
తెలంగాణ వచ్చాకే జానపద గీతాలకు ఆదరణ పెరిగింది. ఒకప్పుడు నాలాంటి జానపదాల రచయితలు, గాయకులను తీన్మారోళ్లు అని మర్యాద లేకుండా వ్యవహరించేవాళ్లు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన భాషకు, యాసకు విలువ వచ్చింది. తీన్మార్కు పట్టం కడుతున్నారు. ఇప్పుడు మన పాటలు, మాటలు లేకుండా సినిమాలు హిట్ అయ్యేలా లేవు. జానపద కళాకారులకు మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే, ఈ తరహా పాటలు రాసేవాళ్లను, పాడేవాళ్లను గౌరవించడం అవసరం. ఒక పాట పుట్టాలంటే అహోరాత్రులు శ్రమించాల్సి వస్తుంది.
…? ఇడుమాల కిరణ్ కుమార్