ప్రముఖ భోజ్‌పురి నటుడు, పార్లమెంట్ సభ్యుడైన రవికిషన్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. ఎవరి మాటను లెక్కచేయడని, అహంకారంతో వ్యవహరిస్తారని ఆయన గురించి చెప్పుకుంటారు. ‘ఆప్ కీ అదాలత్’ అనే టెలివిజన్ షోలో పాల్గొన్న ఆయన సినిమాలపరంగా తన అనుచిత ప్రవర్తన నిజమేనని ఒప్పుకున్నారు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్’ చిత్రంలో తనకు అవకాశం రాకపోవడానికి తన గొంతెమ్మ కోరికలే కారణమని అంగీకరించారు.
‘ఆ సినిమా చేయమని అడినప్పుడు నేను స్నానం చేయడానికి రోజూ ఇరవై ఐదు లీటర్ల పాలు, నిద్రించడానికి గులాబీలు పరచిన మంచం కావాలనే షరతులు విధించాను. దాంతో నన్ను వొద్దనుకున్నారు’ అని రవికిషన్ వివరించారు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మాట్లాడిన రవికిషన్ ‘గ్యాంగ్ ఆఫ్ వస్సేపూర్’ సినిమా విషయంలో తాను ఎలాంటి డిమాండ్లు చేయలేదని, దర్శకనిర్మాతలు తనను అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. తాజా ఇంటర్వ్యూలో తాను చేసిన డిమాండ్స్ నిజమేనని రవికిషన్ అంగీకరించడం సంచలనంగా మారింది.