Youtuber | ప్రముఖ తెలుగు యూట్యూబర్, రివ్యూయర్ పూల చొక్కా నవీన్‌పై వర్జిన్ బాయ్స్ సినిమా నిర్మాత రాజా దారపునేని చేసిన ఫిర్యాదు మేరకు ఆయనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో సినిమాల విజయం చాలా వరకు మౌత్ టాక్‌పై ఆధారపడి ఉంటుంది అనడం అతిశయోక్తి కాదు. మొదటి షో అయిపోయిన వెంటనే యూట్యూబ్ రివ్యూలు వచ్చేస్తున్నాయి. కొందరు యూట్యూబర్స్ వీటిని తమ అభిప్రాయంగా చెబుతూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అయితే, వాటిని నమ్మి చాలా మంది ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లకుండా ఉండిపోతారు. దీనివల్ల చాలా సినిమాలు, ముఖ్యంగా చిన్న సినిమాలు, నిరాశకు గురవుతున్నాయి.
ఇటీవల ఇదే తరహాలో ఓ వివాదం తెరపైకి వచ్చింది. ‘పూలచొక్కా’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న నవీన్ అనే యూట్యూబర్ ఒక చిన్న సినిమా అయిన ‘వర్జిన్ బాయ్స్’ పై నెగటివ్ రివ్యూ ఇచ్చాడు. ఈ రివ్యూలో, “ఇది కథ లేకుండా తీసిన సినిమా… చూస్తే రిలాక్స్ కాదు, ఫుల్ బోర్” అంటూ సెటైర్లు వేసాడు. తన రివ్యూకు బేస్‌గా పెట్టే టమోటా రేటింగ్‌లో ఈ సినిమాకు “సగం టమోటా” ఇచ్చాడు. అంటే అతని రివ్యూ ప్రకారం సినిమా పూర్తిగా నిరాశపరిచిందని అర్థం.ఇక దీనిపై నిర్మాత రాజా దారపునేని తీవ్రంగా స్పందించాడు. “వాడెవడో పూలచొక్కా అంటాడు… మా సినిమా చూడకుండా తక్కువ రేటింగ్ ఇచ్చాడు,” అంటూ ఫైర్ అయ్యాడు. దీనికితోడు, నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, పూలచొక్కా నవీన్ తమను బెదిరించినట్టు ఆరోపించారు. “రూ. 40 వేలు చెల్లిస్తే పాజిటివ్ రివ్యూ ఇస్తా, లేదంటే నెగటివ్ చేస్తా” అని చెప్పాడట. నిర్మాత డబ్బు ఇవ్వకపోవడంతోనే ఇలా నెగటివ్ రివ్యూ ఇచ్చినట్టు ఆయన ఆరోపించారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. పోలీసులు పూలచొక్కా నవీన్‌ను విచారణ కోసం పిలిపించి, కొన్ని గంటల తర్వాత వదిలేశారని సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూట్యూబ్ రివ్యూల ప్రభావం సినిమాలపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అవి ఎంతవరకు బాధ్యతగా ఉండాలి అనే చర్చ మళ్లీ మొదలైంది.