మంగళూరు సోయగం పూజాహెగ్డే జోరుమీదున్నది. దక్షిణాదితో పాటు బాలీవుడ్లో భారీ చిత్రాల్లో నటిస్తూ సత్తా చాటుతున్నది. తాజాగా ఈ అమ్మడు నాగచైతన్య సరసన ఓ చిత్రానికి అంగీకరించినట్లు తెలిసింది. ఈ సినిమాను తమిళ దర్శకుడు వెంకట్‌ప్రభు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించబోతున్నారు. ఇందులో చైతూకు జోడీగా పూజాహెగ్డే నటించనున్నట్లు తెలిసింది. కథతో పాటు తన పాత్ర నచ్చడంతో ఈ భామ సినిమాకు వెంటనే ఓకే చెప్పిందని అంటున్నారు. త్వరలో ఈ విషయమై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తున్నది. గతంలో నాగచైతన్య, పూజాహెగ్డే కలిసి ‘ఒక లైలా కోసం’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జంట మరోమారు వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతుండటం విశేషం.