సినీ ప్రయాణాన్ని తాను పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నానని, జయపజయాల గురించి ఆలోచించకుండా నటిగా పరిణితి చెందడంపైనే దృష్టి పెట్టానని చెప్పింది పూజాహెగ్డే. దక్షిణాదిలో అగ్రనాయికగా పేరు తెచ్చుకున్న ఈ భామకు గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కెరీర్ కమ్‌బ్యాక్ సినిమా కోసం ఎదురుచూస్తున్నది. ప్రస్తుతం ఆమె చేతిలో జననాయగన్, కాంచన -4 వంటి భారీ ప్రాజెక్ట్‌లున్నాయి. ఇటీవలే పూజాహెగ్డే పుట్టినరోజుని జరుపుకుంది. ఈ సందర్భంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కెరీర్‌పై ధీమా వ్యక్తం చేసింది.
కెరీర్ ఆరంభంలోనే పరాజయాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నానని, ఆ తర్వాత వరుస విజయాలతో స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నానని చెప్పింది. ‘ఒక్కోసారి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయాలు దక్కవు. అయితే ఫెయిల్యూర్స్‌కి నేనెప్పుడూ కుంగిపోను. ప్రస్తుతం చేస్తున్న సినిమాలపై గట్టి నమ్మకంతో ఉన్నాను. ఈసారి మాత్రం నా అంచనాలు తప్పవు. మళ్లీ తిరిగి పూర్వ వైభవాన్ని సాధిస్తానని నమ్మకం ఉంది’ అని చెప్పింది.