Pongal | ప్రతి ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాల సందడి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ పండుగకి చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తుంటాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండనుంది. అనీల్ రావిపూడి-చిరంజీవి ప్రాజెక్ట్ సంక్రాంతికి రానుందని ఎప్పుడో చెప్పేశారు. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావడం, టీమ్‌తో కథానాయిక నయనతార కూడా జాయిన్ కావడం జరిగింది. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భగవంత్ కేసరి’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి వరుస హిట్ చిత్రాలు అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు చిరంజీవితో చేయబోతున్న చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నారు.
వీలైనంత త్వరగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసి 2026 సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నారు. ఇక సంక్రాంతి బరిలో ఉన్న రెండో సినిమా నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో నవీన్ పొలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14 ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మారి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. సంక్రాంతి బరిలో మాస్ మహారాజా కొత్త చిత్రం కూడా నిలుస్తుంది. ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.
రవితేజ 76′ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రస్తుతం ‘అనార్కలి’ అనే వర్కింగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ రేసులో తమిళ స్టార్ హీరో విజయ్ కూడా నిలిచాడు. ఆయన నటిస్తున్న చివరి చిత్రం జన నాయగన్ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కానున్నట్టు కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. దీంతో ఈ సారి పోటీ గట్టిగానే ఉండనున్నట్టు అర్ధమవుతుంది. ఇంకా ఆరు నెలల సమయం ఉండడంతో ఇంకొన్ని చిత్రాలు కూడా సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉంది.