The Kerala Story 2 | దేశంలో ఎన్నికల నగారా మోగడానికి సిద్ధమవుతున్న వేళ, వెండితెరపై మళ్ళీ వివాదాస్పద రాజకీయ సెగలు మొదలయ్యాయి. 2023లో బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో పాటు అంతకంటే పెద్ద ఎత్తున వివాదాలను మూటగట్టుకున్న ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. ‘ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్’ (The Kerala Story 2: Goes Beyond) పేరుతో రూపొందిన ఈ చిత్ర టీజర్ చిత్రయూనిట్ తాజాగా విడుదల చేసింది. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ టీజర్ విడుదల కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు, విశ్లేషకులు దీనిని అధికార బీజేపీ పార్టీకి అనుకూలంగా పని చేసే ‘ప్రాపగండా చిత్రం’గా అభివర్ణిస్తున్నారు.
గతంలో కూడా ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’,’రజాకార్’, ‘ది బెంగాల్ ఫైల్స్’, ‘ది సబర్మతి రిపోర్ట్’, వంటి సినిమాలు ఎన్నికల సమయంలో విడుదలై ఓటర్ల భావోద్వేగాలను ప్రభావితం చేశాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అదే పంథాలో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ‘ది కేరళ స్టోరీ 2’ టీజర్ చూసుకుంటే.. మొదటి భాగంలో కేవలం కేరళలోని మత మార్పిడుల గురించి చర్చించగా, ఈ సీక్వెల్ పరిధిని మరింత పెంచారు. ఈసారి కథ కేరళతో ఆగకుండా మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు విస్తరించింది. ముగ్గురు యువతుల జీవితాలు మత మార్పిడి మరియు లవ్ ట్రాప్స్ వల్ల ఎలా చితికిపోయాయనే కోణంలో టీజర్ సాగింది. అదా శర్మ స్థానంలో ఈసారి ఉల్కా గుప్తా, ఐశ్వర్య ఓజా, అదితి భాటియా వంటి కొత్త నటీనటులు కనిపిస్తున్నారు. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ.. అబ్ సహేంగే నహీ.. లడేంగే (ఇక భరించం.. పోరాడుతాం) అనే డైలాగ్‌తో టీజర్‌ను ముగించారు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు గ్రహీత కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. విపుల్ అమృత్లాల్ షా దీనిని నిర్మించారు. మొదటి భాగానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 27న విడుదల కాబోతుంది.
VIPUL SHAH’S NEXT: ‘THE KERALA STORY 2’ TEASER OUT NOW – 27 FEB 2026 RELEASE… Producer #VipulAmrutlalShah has unveiled the teaser of #TheKeralaStory2, slated to arrive in cinemas on 27 Feb 2026.
Directed by #KamakhyaNarayanSingh… Co-produced by #AashinAShah and… pic.twitter.com/ROkVCogqdb
— taran adarsh (@taran_adarsh) January 30, 2026