నటీనటులు: మైరా విశ్వకర్మ, ప్రేరణ శర్మ
దర్శకుడు: వినోద్ కాప్రి
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
Pihu | పిల్లల సినిమా అనగానే వాళ్లు చేసే అల్లరి, సరదా సరదా కబుర్లు ఆశిస్తాం. అయితే, ఈ సినిమా మాత్రం మన ఊహకు అందని విధంగా ఉంటుంది. అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌లో చిక్కుకున్న ఓ చిన్నారి కథే ‘పిహు’. 2018లో హిందీలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్ టాప్ రేటెడ్ మూవీస్ లిస్ట్‌లో ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత చిన్న పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలి బయటికి వెళ్లాలంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు.
పిహు (మైరా విశ్వకర్మ) బర్త్‌డే తర్వాతి రోజు జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. పిహు పుట్టినరోజు వేడుకకు తండ్రి గౌరవ్ (రాహుల్ బగ్గా) ఆలస్యంగా వస్తాడు. తన భర్త గౌరవ్‌కు మీరా అనే మహిళతో అక్రమ సంబంధం ఉందని పిహు తల్లి పూజ (ప్రేరణ శర్మ) అప్పటికే అనుమానం పెంచుకుంటుంది. కూతురు పుట్టిన రోజున కూడా భర్త ఆలస్యంగా రావడాన్ని జీర్ణించుకోలేని పూజ.. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటుంది.
ఆ విషయాన్ని గుర్తించక గౌరవ్ ఆఫీస్ పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్తాడు. పిహు నిద్రలేచి చూసేసరికి తల్లి మరణిస్తుంది. ఈ విషయం తెలియని చిన్నారి పలుసార్లు తల్లిని లేపేందుకు ప్రయత్నిస్తుంది. ఎంతకీ సాధ్యం కాకపోవడంతో మామూలుగానే ఆడుకోవడం మొదలుపెడుతుంది. తల్లి మరణించిందని తెలియక చిన్నారి పిహు… ఇంట్లో ఏం చేస్తుంది.
ఆడుకునే క్రమంలో ఫ్రిజ్, గ్యాస్, వాటర్ ఫిల్టర్, ఐరన్ బాక్స్‌ను ఆన్‌చేసి అలాగే వదిలేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆ చిన్నారికి ఏమవుతుందోనన్న ఉత్కంఠ మొదలవుతుంది. కేవలం రూ.45 లక్షల బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కించారు. పిహుగా.. బాలనటి మైరా మెప్పిస్తుంది. ఎందుకు ఆలస్యం.. వీకెండ్లో సస్పెన్స్ కోరుకునేవాళ్లకు ఈ సినిమా మంచి ఎంపిక.