Mahatma Jyotirao Phule | ప్రముఖ సామాజిక తత్వవేత్త, మహిళల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా జ్యోతి రావు ఫూలే (1827-1890) అతడి భార్య సావిత్రి బాయి ఫూలే జీవిత చరిత్రల ఆధారంగా బాలీవుడ్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఫూలే (Phule) అనే టైటిల్‌తో ఈ సినిమా రాబోతుండగా.. ఫూలే పాత్రలో గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీ నటిస్తున్నాడు. అతడి భార్య సావిత్రి బాయి ఫూలే పాత్రలో బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు భార్య పత్రలేఖ నటిస్తుంది.
అనంత్ నారాయణ్ మహాదేవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రణయ్ చోక్షి, జగదీష్ పటేల్, రితేష్ కుదేచా, అనుయా చౌహాన్ కుదేచా, సునీల్ జైన్ తదితరులు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం మొదట ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ విడుదల వాయిదా పడింది. ఈ మూవీకి బ్రాహ్మణ సమాజం నుంచి వ్యతిరేకత రావడంతో మూవీ విడుదలను వాయిదా వేశారు మేకర్స్.
ఈ సినిమా బ్రాహ్మణ సమాజాన్ని తప్పుగా చూపిస్తుందని.. కులవాదాన్ని ప్రోత్సహిస్తుందని బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆనంద్ దవేతో పాటు పలు బ్రాహ్మణ సంఘాలు ఆరోపించాయి. ఇదే కాకుండా సెన్సార్ బోర్డు కూడా కుల సంబంధిత పదాలను తొలగించాలని సూచించింది. అయితే ఈ చిత్ర దర్శకుడు అనంత్ మహదేవన్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, సినిమా చారిత్రక వాస్తవాల ఆధారంగా రూపొందిందని, ఎటువంటి అజెండా లేదని వెల్లడించారు.
దేశంలోని మనుషులంతా సమానత్వంతో జీవించాలని ఆకాంక్షించి వర్ణ, లింగ వివక్షకు వ్యతిరేకంగా.. దళిత, గిరిజన, బహుజన వర్గాల అభ్యున్నతి, మహిళల హక్కుల కోసం జ్యోతిబా ఫూలే చేసిన పోరాటం ఆధారంగా ఈ సినిమా రాబోతుండగా.. ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది.