R. Narayana Murthy | సింగిల్ థియేటర్లు ఎదుర్కొంటున్న కష్టాలపై పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి తాజాగా స్పందించారు. థియేటర్లలో ‘పర్సంటేజీ విధానం’ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పర్సంటేజీ సిస్టం కోసం పోరాడుతూ బంద్ ప్రకటిస్తే, దానిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేశ్ లు ‘హరి హర వీరమల్లు’ సినిమాను అడ్డుకునే ప్రయత్నంగా చిత్రీకరించడం సరికాదని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. పర్సంటేజీ విధానం అమలైతే చిన్న సినిమాలు తీసే తనలాంటి నిర్మాతల కష్టాలు తొలగిపోతాయని తాను ఆశించినట్లు నారాయణమూర్తి పేర్కొన్నారు. అయితే, థియేటర్ల బంద్‌ను ‘హరి హర వీరమల్లు’ సినిమాను అడ్డుకునేందుకు తెరపైకి తెచ్చారని స్వయానా మంత్రి కందుల దుర్గేశ్ అనడం తనను బాధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కష్టపడి డిప్యూటీ సీఎం అవ్వడం తనకు ఎంతో గర్వంగా ఉందని కానీ డిప్యూటీ సీఎంగా ఉండి ‘హరి హర వీరమల్లు’ టాపిక్ తీసుకురావడం బాధకలిగించిదని మూర్తి తెలిపాడు.
ప్రస్తుతం థియేటర్లలో ఉన్న పాప్‌కార్న్ రేట్లు, టికెట్ రేట్లు అన్నీ కలిసి సామాన్యుడిని సినిమాకు దూరం చేస్తున్నాయని నారాయణమూర్తి వాపోయారు. అసలు టికెట్ రేట్ల పెంపు కోసం ఎందుకు అడుగుతున్నారని, ఎందుకు పెంచుతున్నారని ఆయన ప్రశ్నించారు. హాలీవుడ్లో వేల కోట్లు పెట్టి ‘ది టెన్ కమాండ్మెంట్స్’, ‘బెనహర్’ వంటి చిత్రాలు తీశారని, కానీ వారెప్పుడూ టికెట్ రేట్లు పెంచమని అడగలేదని ఆయన గుర్తు చేశారు. అలాగే, ‘మొఘల్ ఎ ఆజాం’, ‘షోలే’ వంటి చిత్రాలు ఎన్నో ఏళ్లు కష్టపడి తీసినా ఎక్కడా టికెట్ రేట్లను పెంచలేదన్నారు. ‘లవకుశ’ సినిమా ఐదేళ్లు కష్టపడి తీసి అప్పుల పాలైనా టికెట్ రేట్లను పెంచలేదని గుర్తు చేశారు. సినిమా బాగుంటే జనాలు వస్తారని, హిట్ చేస్తారని, “లారీల్లో, గూడ్స్ ట్రైన్లలో తీసుకు వెళ్లేంత లాభాల్ని ఇస్తారు” అని నారాయణమూర్తి వ్యాఖ్యానించారు.
వేల కోట్ల బడ్జెట్లతో భారీ సినిమాలు తీస్తున్నందుకు గర్విస్తున్నామని, అయితే టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించారు. మామూలు టికెట్ రేట్లతోనే సినిమాను విడుదల చేయాలని, సామాన్యుడికి సినిమాను ఎందుకు దూరం చేస్తున్నారని, ఉన్న ఒక్క వినోదాన్ని ఎందుకు అంత ఖరీదు చేస్తున్నారని ఆయన నిలదీశారు. అలాగే బంద్ అనేది ప్రజాస్వామ్యంలో బ్రహ్మాస్త్రం అని, బంద్ ప్రకటించే హక్కు అందరికీ ఉంటుందని నారాయణమూర్తి అన్నారు. అయితే, మూడు వారాల ముందు ఫిల్మ్ ఛాంబర్‌కు తెలియపరచాలని ఆయన సూచించారు. జూన్ 1న బంద్ ప్రకటిస్తే, మూడు వారాల ముందు చెప్పలేదు కాబట్టి అది వర్తించదని, అయినా ఇది ‘హరి హర వీరమల్లు’కు ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు.
అలాగే తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ తరహా అవార్డులను తీసుకురావాలని నారాయణమూర్తి డిమాండ్ చేశారు.