Peddi | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది విడుదలకు సిద్ధమవుతోంది. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదల దిశగా మరో అడుగు ముందుకు వేసింది. చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి అధికారిక క్లియరెన్స్ లభించినట్లు సమాచారం. దీంతో పాటు ఈ సినిమాకు సంబంధించిన రన్‌టైమ్, సెన్సార్ టాక్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
సాధారణంగా ప్రస్తుతం కమర్షియల్ చిత్రాలు రెండున్నర గంటల లోపే ఉండేలా దర్శకులు ప్లాన్ చేస్తున్నారు. అయితే ‘పెద్ది’ విషయంలో దర్శకుడు బుచ్చిబాబు కథపై పూర్తి నమ్మకంతో భారీ నిడివిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం దాదాపు 3 గంటల 9 నిమిషాల (189 నిమిషాలు) రన్టైమ్తో సెన్సార్ పూర్తి చేసుకుందని సమాచారం. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ కెరీర్లో ఇంతటి సుదీర్ఘ నిడివితో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. సినిమాలోని భావోద్వేగాలు, యాక్షన్ ఎలిమెంట్స్, కథలోని తీవ్రత ప్రేక్షకులను మొత్తం ప్రయాణంలో కట్టిపడేస్తాయని చిత్ర బృందం ధీమాగా ఉంది. ఎక్కడా కథ నెమ్మదించకుండా స్క్రీన్‌ప్లేను బుచ్చిబాబు ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం 1980ల కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే జీవన విధానం, క్రీడా సంస్కృతి, మనుషుల మధ్య ఉన్న భావోద్వేగాలు, పంతాలు, పట్టింపులను కథలో ప్రధానాంశాలుగా తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ పూర్తిగా కొత్త రస్టిక్ లుక్‌లో కనిపించనున్నారు. పాత్ర కోసం ఆయన తన శరీరాకృతిని కూడా ప్రత్యేకంగా మార్చుకున్నట్లు ఇప్పటికే విడుదలైన పోస్టర్లు స్పష్టం చేశాయి. ఈ లుక్కు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సెన్సార్ బృందం నుంచి కూడా సినిమాకు మంచి స్పందన వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటన, బుచ్చిబాబు మేకింగ్, సినిమాలోని ఎమోషనల్ కంటెంట్ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయని టాక్ వినిపిస్తోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కదిలించే స్థాయిలో ఉంటాయని కూడా సమాచారం.