Tollywood | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల మధ్య కొనసాగుతున్న వివాదం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. కలెక్షన్లలో వాటా పద్ధతి అయిన ‘పర్సంటేజ్ సిస్టమ్’ అంశంపై రెండు వర్గాల మధ్య విభేదాలు మరింత తీవ్రరూపం దాల్చడంతో, పరిశ్రమలో పెద్దదిక్కుగా భావించే మెగాస్టార్ చిరంజీవి ఈ సమస్య పరిష్కారానికి స్వయంగా ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రతినిధులు చిరంజీవిని ఆయన నివాసంలో కలవనున్నట్లు సమాచారం. ఈ భేటీ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. పరిశ్రమ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉన్న ఈ సమావేశంపై అందరి దృష్టి పడింది.
రెంటల్ విధానంపై ఎగ్జిబిటర్ల అసంతృప్తి
ప్రస్తుతం మల్టీప్లెక్స్‌లలో కలెక్షన్ల ఆధారంగా పర్సంటేజ్ షేరింగ్ విధానం అమలులో ఉంది. అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్ల విషయంలో మాత్రం పాత ఫిక్స్డ్ రెంటల్ పద్ధతినే కొనసాగిస్తున్నారని ఎగ్జిబిటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ప్రభావం, విద్యుత్ ఛార్జీల పెరుగుదల, నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి క్లిష్టంగా మారిందని వారు చెబుతున్నారు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఒకే స్థిర అద్దె చెల్లించాల్సి రావడం తమపై తీవ్ర ఆర్థిక భారం పెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో అమలవుతున్న రెవెన్యూ షేరింగ్ విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదల సమయంలోనే ఈ వివాదం మరింత వేడెక్కింది. ‘పెద్ది’ సినిమా నుంచే పర్సంటేజ్ విధానం అమలు చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ డిమాండ్ అమలు కాకపోతే సినిమా ప్రదర్శనపై నిర్ణయం తీసుకుంటామని కూడా సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. అదే సమయంలో టికెట్ ధరల పెంపుపై కూడా ఎగ్జిబిటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే థియేటర్లకు ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోందని, అదనపు ధరలు విధిస్తే సాధారణ ప్రేక్షకులు మరింత దూరమయ్యే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. పరిశ్రమలో పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ముందుండి స్పందించే వ్యక్తిగా చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈసారి ఒకవైపు తన కుమారుడు రామ్ చరణ్ సినిమా విడుదల, మరోవైపు థియేటర్ల యజమానుల సమస్యలు ఉండటంతో ఆయన ఈ వివాదంలో జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది.