Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది విడుదల తేదీపై గందరగోళం నెలకొంది. మొదట ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, తాజా పరిణామాలు చూస్తుంటే ఆ తేదీకి రావడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈవెంట్లో నిర్మాత ఎస్కేఎన్ సినిమా వాయిదా పడే అవకాశాలపై వ్యాఖ్యలు చేయడంతో మెగా అభిమానులు తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై వివాదం రేగడంతో ఆయన తర్వాత వివరణ ఇచ్చారు. మరోవైపు, ‘రాకాస’ టీంతో మాట్లాడిన సమయంలో “సినిమా లేట్ అవ్వదు” అని రామ్ చరణ్ స్వయంగా చెప్పడంతో ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యారు. అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తే వాయిదా అనివార్యంగా కనిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, ‘పెద్ది’ సినిమా జూన్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ రెండు తేదీలను పరిశీలిస్తోంది. జూన్ 4 లేదా జూన్ 24. ఈ తేదీల్లో ఏదో ఒకదానిని ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. కీలక సన్నివేశాల్లో రామ్ చరణ్ పాల్గొంటూ బిజీగా ఉన్నారు. సినిమాను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు టీమ్ కష్టపడుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ముఖ్య పాత్రల్లో శివరాజ్ కుమార్, జగపతి బాబు , అలాగే ‘మిర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ కనిపించనున్నారు.
సంగీతాన్ని ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందిస్తుండగా, ఇప్పటికే విడుదలైన పాటలు మంచి స్పందన పొందాయి. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్‌పై క్లారిటీ రాగానే ప్రమోషన్స్‌ను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేలా యూనిట్ ప్లాన్ చేస్తోంది. మొత్తానికి, ‘పెద్ది’ ఏప్రిల్‌లో కాకుండా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి అధికారిక ప్రకటనపైనే ఉంది.