Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు సర్వం సిద్ధమైంది. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ క్రీడల నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే విడుదలకు ముందు చిత్ర బృందం ట్రోలింగ్, పైరసీ వ్యవహారాలపై సీరియస్‌గా స్పందించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలి కాలంలో స్టార్ హీరోల సినిమాల విడుదలకు ముందు సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం, ట్రోలింగ్, ఫేక్ హ్యాష్‌ట్యాగ్ క్యాంపెయిన్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలపై కొన్ని ఫేక్ అకౌంట్ల ద్వారా సినిమాలపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. ‘పెద్ది’ విషయంలో కూడా అలాంటి పరిస్థితులే కనిపించడంతో మూవీ మేకర్స్ ముందుగానే అప్రమత్తమయ్యారు.
రామ్ చరణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, సినిమాపై ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ చిత్ర నిర్మాతలు సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి, హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన మరో వ్యక్తిపై ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు సమాచారం. ఇదే సమయంలో కొన్ని సోషల్ మీడియా ఖాతాలు ఒకే తరహా పోస్టులు, ఒకే హ్యాష్‌ట్యాగ్‌లతో సమన్వయంగా ట్రోలింగ్ నిర్వహించడం అనుమానాలకు తావిస్తోందని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత ట్రోలింగ్ మాత్రమే కాకుండా, డబ్బులు తీసుకుని నిర్వహించే ఆర్గనైజ్డ్ నెగిటివ్ క్యాంపెయిన్‌లా? అనే కోణంలో కూడా విచారణ సాగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పెద్ద సినిమాలపై కావాలనే నెగిటివ్ ట్రెండ్స్ సృష్టించడం ద్వారా సోషల్ మీడియాలో విషపూరిత వాతావరణం ఏర్పడుతోందని సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు ట్రోలింగ్‌తో పాటు పైరసీని కూడా ‘పెద్ది’ మేకర్స్ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. సినిమా విడుదలకు ముందే నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి ప్రత్యేక రక్షణ కోరారు. దీనిపై స్పందించిన కోర్టు ‘యాంటీ పైరసీ ఇంజంక్షన్’ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం సినిమా విడుదలైన తర్వాత అనుమతి లేకుండా ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడం, టెలిగ్రామ్ ఛానల్స్, టోరెంట్ సైట్లు, పైరసీ వెబ్సైట్ల ద్వారా ప్రసారం చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం. అంతేకాదు, ఈ కేసులో కోర్టు ‘డైనమిక్ ఇంజంక్షన్’ను కూడా మంజూరు చేసింది. సాధారణంగా ఒక పైరసీ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే నిర్వాహకులు కొత్త డొమైన్ లేదా కొత్త యూఆర్ఎల్తో మళ్లీ యాక్టివ్ అవుతుంటారు. కానీ ఈసారి అలాంటి అవకాశాలకు కూడా చెక్ పెట్టేలా కోర్టు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఒకసారి గుర్తించిన పైరసీ నెట్వర్క్ కొత్త పేర్లతో వచ్చినా వెంటనే బ్లాక్ చేసే అధికారం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఇచ్చినట్లు తెలుస్తోంది.