Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సంచలన ఆరంభాన్ని నమోదు చేసింది. భారీ అంచనాల మధ్య జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తొలి రోజే రికార్డు స్థాయి వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. బుధవారం రాత్రి నుంచే ప్రారంభమైన ప్రీమియర్ షోలకు అద్భుతమైన స్పందన లభించగా, అదే ఉత్సాహం తొలి రోజు కలెక్షన్లలోనూ కనిపించింది.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, దేశవ్యాప్తంగా వేలాది స్క్రీన్లలో ప్రదర్శితమైన ‘పెద్ది’ మొదటి రోజు భారతదేశంలో సుమారు రూ.69.50 కోట్ల నికర వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన ఆదాయం కూడా భాగమైంది. దేశీయంగా గ్రాస్ కలెక్షన్లు రూ.82 కోట్లకు పైగా నమోదు కాగా, ఓవర్సీస్ మార్కెట్లోనూ సినిమా అద్భుత ప్రదర్శన కనబరిచింది. ప్రత్యేకంగా ఉత్తర అమెరికా సహా విదేశీ మార్కెట్లలో ‘పెద్ది’కి మంచి ఆదరణ లభించింది. ఓవర్సీస్లో సుమారు రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన చిత్రాల్లో అత్యుత్తమ ఓపెనింగ్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
భాషల వారీగా పరిశీలిస్తే తెలుగు వెర్షన్ నుంచే అత్యధిక వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు భారీ ఎత్తున థియేటర్లకు తరలివెళ్లడంతో కలెక్షన్లు ఊపందుకున్నాయి. హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా సినిమా మంచి స్పందనను అందుకుంది. 1980-90ల కాలం నేపథ్యంలో విజయనగరం జిల్లా గ్రామీణ వాతావరణంలో సాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ ‘పెద్ది’ పాత్రలో పూర్తిగా కొత్త మాస్ అవతారంలో కనిపించారు. కార్మికుల హక్కులు, గ్రామీణ క్రీడలు, సామాజిక సమస్యల చుట్టూ తిరిగే కథలో ఒక సాధారణ కూలీ అసాధారణ ప్రయాణాన్ని దర్శకుడు బుచ్చిబాబు భావోద్వేగంగా ఆవిష్కరించారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, శివరాజ్‌కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్లు, భావోద్వేగ సన్నివేశాలు, దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగే క్లైమాక్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. రామ్ చరణ్ నటనకు అభిమానులతో పాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి.