Peddi | టాలీవుడ్లో ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోటీకి రంగం సిద్ధమవుతోంది. రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమా విడుదల తేదీగా జూన్ 4ను అధికారికంగా ప్రకటించారు. మొదట ఇదే తేదీకి రావాల్సిన ‘టాక్సిక్’ వాయిదా పడటంతో, సమ్మర్ హాలిడేస్‌ను క్యాష్ చేసుకునేలా ‘పెద్ది’ని బరిలోకి దింపుతున్నారు. అయితే ఇదే వారం విడుదలకు సిద్ధమైన మరో సినిమా ‘రావు బహదూర్’ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహేష్ బాబు నిర్మాణ భాగస్వామ్యంతో, సత్యదేవ్ హీరోగా, వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైకలాజికల్ డ్రామాను జూన్ 5న విడుదల చేయాలని మేకర్స్ ముందుగానే ప్రకటించారు.
ఇప్పుడు ‘పెద్ది’ ఒక రోజు ముందుగా జూన్ 4న రావడంతో, ఈ రెండు చిత్రాల మధ్య క్లాష్ అనివార్యంగా కనిపిస్తోంది. భారీ క్రేజ్ ఉన్న ‘పెద్ది’కి ఎక్కువ థియేటర్లు దక్కే అవకాశం ఉంది. దాంతో కంటెంట్ ఆధారిత చిత్రం అయిన ‘రావు బహదూర్’కు సరిపడా స్క్రీన్లు దొరకడం సవాలుగా మారవచ్చు. థియేటర్ల కొరత ఏర్పడితే, సినిమా పాజిటివ్ టాక్ వచ్చినా కూడా వసూళ్లపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.అయితే ‘రావు బహదూర్’ టీమ్ మొదటగా జూన్ 4న యశ్ నటించిన ‘టాక్సిక్’ విడుదల ఉండబోతుందని తెలిసినా, అదే సమయానికి తమ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇది తమ కంటెంట్‌పై ఉన్న నమ్మకాన్ని సూచిస్తుంది. కానీ ఇప్పుడు ఆ తేదీకి రామ్ చరణ్ సినిమా రావడం పరిస్థితిని మార్చేసింది.
ఇక రామ్ చరణ్ మరియు మహేష్ బాబు మధ్య ఉన్న స్నేహం కూడా ఈ క్లాష్‌పై ప్రభావం చూపవచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోటీని నివారించేందుకు ‘రావు బహదూర్’ విడుదల తేదీని వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మరి చివరికి ఈ రెండు సినిమాలు నిజంగా బాక్సాఫీస్ వద్ద తలపడతాయా? లేక రిలీజ్ డేట్స్‌లో మార్పులు చోటుచేసుకుంటాయా? అనేది ఆసక్తికరంగా మారింది.