Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నతాజా చిత్రం ‘పెద్ది’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చరణ్ ఈ చిత్రంతో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఫెయిల్యూర్‌ను మరిచిపోయేలా, ఓ మాస్ ఎమోషనల్ డ్రామాతో వస్తున్నాడు చరణ్. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ కోసం మరో డెప్త్ ఉన్న క్యారెక్టర్ డిజైన్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు పెద్ది సినిమాను స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిస్తున్నారు. క్రికెట్, కబడ్డీ, కుస్తీ వంటి స్థానిక ఆటల నేపథ్యంలో సినిమా సాగనుందని సమాచారం.
చరణ్ ఇందులో ‘ఆట కూలీ’ పాత్రలో కనిపించనున్నట్టు టాక్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చరణ్ గెటప్ కూడా మరీ డిఫరెంట్‌గా ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ సినిమాకు మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ న్యూ బల్కీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను ఆగస్టు 25, 2025, వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. గ్లింప్స్ మూవీపై అంచనాలు పీక్స్‌కి తీసుకెళ్లగా, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ సంగీత సారధ్యంలో రూపొందుతున్న సాంగ్స్ అభిమానులకి పూనకాలు తెప్పించడం గ్యారెంటీ అంటున్నారు.
‘పెద్ది’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సినిమా స్కేల్, టెక్నికల్ టీమ్, నటీనటుల ఎంపిక అన్నీ చూస్తే ఇది రామ్ చరణ్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలవబోతుందని అభిమానులు నమ్ముతున్నారు.జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇటీవల రామ్ చరణ్ జిమ్ లుక్ ఒకటి వైరల్ కాగా, అది చూసిన ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నాడంటూ కామెంట్స్ చేశారు.