Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘పెద్ది’ తో బిజీగా ఉన్నాడు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టాలీవుడ్లోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో కూడా భారీ అంచనాలను రేపుతోంది. ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి విభిన్న కాన్సెప్ట్‌లతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన రామ్ చరణ్, ఇప్పుడు ‘పెద్ది’తో మరోసారి తన నటనలో కొత్త ఎత్తులను చేరబోతున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ‘దేవర’తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న జాన్వీకి ఇది రెండో తెలుగు సినిమా కాగా, ఆమె పాత్ర ఈ కథలో కీలకంగా నిలవనుంది.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌కు కీలక ఫైనాన్షియర్ సతీష్ కిలారు తన తొలి ప్రొడక్షన్‌గా తెరకెక్కిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలు, క్రీడల మేళవింపుతో ఈ సినిమా టాలీవుడ్లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది.ఇటీవల విడుదలైన “చికిరి చికిరి” పాటతో సినిమా హైప్ మరింత పెరిగింది. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాటలో రామ్ చరణ్ స్టైలిష్ లుక్‌తో పాటు మాస్ డ్యాన్స్ స్టెప్స్‌తో అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. యూట్యూబ్‌లో గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌ను సాధించి మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
తాజా సమాచారం ప్రకారం, సీనియర్ నటి శోభన కూడా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది ‘కల్కి 2898 ఏడీ’తో రీ-ఎంట్రీ ఇచ్చిన శోభన, ఈ సినిమాలో భావోద్వేగభరితమైన కీలక పాత్రలో మెప్పించబోతున్నారు. ఆమె పాత్ర కథలో ప్రధాన మలుపు తీసుకువస్తుందని, సినిమా ఎమోషనల్ డెప్త్‌ను పెంచుతుందని సమాచారం. ‘పెద్ది’ కథ ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగుతుందని, రామ్ చరణ్ ఇందులో ఒక క్రీడాకారుడి పాత్రలో కనిపించనున్నాడు. బుచ్చిబాబు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ పాత్ర చరణ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న గ్రాండ్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.