Peddha Kapu Movie Review | కొత్తవారితో సినిమాలు చేయడంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకి మంచి పేరుంది. కొత్తబంగారు లోకం, ముకుంద కొత్తవాళ్ళతో చేసిన సినిమాలే. ఇప్పుడు విరాట్ కర్ణ ని హీరోగా పరిచయం చేస్తూ పెదకాపు -1 సినిమా చేశారు. అఖండ లాంటి భారీ విజయం తర్వాత నిర్మాత మిర్యాల రవీందర్.. అంతా కొత్తవాళ్ళు అయినప్పటికీ ఒక పెద్ద సినిమాకి ఖర్చు చేసినట్లే పెదకాపు నిర్మించారని ప్రచార చిత్రాలు చూస్తే అర్ధమైయింది. శ్రీకాంత్ అడ్డాల నుంచి ఇలాంటి రస్టిక్ కంటెంట్ వున్నా సినిమా రావడం, ముందేగానే రెండు పార్టులని చెప్పడం, ప్రచార చిత్రాలు క్యురియాసిటీని పెంచడంతో పెదకాపు1 పై మంచి బజ్ ఏర్పడింది. మరా ఆసక్తి సినిమాలో కొనసాగిందా ? లేదా? తెలియంటే ముందు పెదకాపు కథలోకి వెళ్దాం
కథ ఏంటంటే:
1962లో గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాల్లో చెలరేగిన అల్లర్లుతో ఈ కథ మొదలౌతుంది. ఇరవై ఏళ్ల తర్వాత అంటే 1982లో ఓ కొత్తపార్టీ పుట్టిన నేపధ్యంలో అసలు కథ తెరపైకి వస్తుంది. సత్యరంగయ్య (రావు రమేష్) బయన్న ( నరేన్) బద్ద శత్రువులు. తమ అధికార కోసం బలహీన వర్గాలని వాడుకొని, అవమానించి, అలజడులు సృష్టించి, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంటారు. పెదకాపు (విరాట్ కర్ణ) అన్నయ్య లీల( వికాస్) సత్యరంగయ్య వద్ద నమ్మిన బంటుగా పని చేస్తుంటాడు. తన కొడుకు కన్నాబాబు ( శ్రీకాంత్ అడ్డాల)ని అవమానించాడన్న కోపంతో బయ్యన్న కొడుకు (విజయ్ రామరాజు) ని దారుణంగా చంపేస్తాడు సత్య రంగయ్య. అయితే ఆ నేరాన్ని తన మీద వేసుకొని జైలు పాలవుతాడు పెదకాపు అన్నయ్య లీల. అయితే జైలు కెళ్లాక లీల కనిపించకుండా పోతాడు. అసలు లీల ఏమయ్యాడు ? పెదకాపు సత్య రంగయ్య, బయన్నలపై ఎలాంటి పోరాటం చేశాడు. ఈ కథలో అక్కమ్మ (అనసూయ) తాయి ( ప్రగతి శ్రీవాస్తవ్ ) గౌరి( బ్రిగడ) మాస్టర్ ( తనికెళ్ళ భరణి ) ఎలాంటి భూమిక పోషించారు. అసలు 1962లో అల్లర్లు చెలరేగడానికి కారణం ఏమిటి ? అనేది తక్కిన కథ.
కథా విశ్లేషణ:
ఒక సామాన్యుడు ఇద్దరు బలవంతులని ఎదుర్కొని చేసిన తిరిగుబాటు, పోరాటాన్ని చూపించడం ఈ కథ ఉద్దేశం. అందుకే ఈ కథకి సామాన్యుడి సంతకం అనే క్యాప్షన్ కూడా పెట్టారు. టైటిల్ క్యాప్షన్ వరకూ క్లారిటీగా వున్న దర్శకుడు.. అసలు కథ చెప్పడంలో స్పష్టత కొరవడిన భావన కలుగుతుంది. ఒక పసిపాప ఎపిసోడ్ కథ మొదలౌతుంది. ఆ పాప ప్రయాణం ఏమౌతుందో తెలుసుకోవాలనే ఆసక్తి నిజంగానే ప్రేక్షకుడిలో కలుగుతుంది. ఐతే ఆ కథని అక్కడ వదిలేసి సత్యరంగయ్య, బయన్న పాత్రలని పరిచయం చేసి వాళ్ళ కథని చెప్పుకుంటూ వెళ్లారు. ఈ పాత్రల పరిచయం, వాళ్ళ వెనుక వున్న కథలకి ఒక లిమిట్ అంటూ వుండదు. ఏ సినిమాలోనైనా అసలు కథ ఏమిటో ఒక పదినేను నిమిషాల తర్వాత మొదలైపోవాలి. కానీ ఇందులో మాత్రం ఒక వెబ్ సిరిస్ మోడల్ లో ఏవేవో పాత్రలు వస్తూనే వుంటాయి. ఏ పాత్రతో, ఏ ఎమోషన్ తో ఈ కథని ఫాలో అవ్వాలనే అయోమయం ప్రేక్షకుడిలో కలుగుతుంది.
తాను రాసుకున్న పాత్రలపై దర్శకుడికి ప్రేమ వుండటం మంచిదే. కానీ ఆ పాత్ర కథని ముందుకు నడుపుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఇందులో చాలా వరకూ పాత్రలు ఒక ఎమోషన్ ని కొనసాగించకుండా సడన్ గా ఆగిపోయిన ఫీలింగే కలుగుతుంది. సామాన్యుడి పోరాటం అంటే.. అతను ఏం చేశాడు ? ఎలా ప్రయాణించాడు ? ఎలాంటి సవాళ్ళు ఎదురుకున్నాడు ? ఇలాంటి అంశాలపై ద్రుష్టిపెట్టుంటే ఈ కథతో, ఆ పాత్రతో ప్రేక్షకులు ప్రయాణించే అవకాశం వుండేది. నిజానికి ఇందులో లేనిది సామాన్యుడి పోరాటమే అనిపించేలా సన్నివేశాలని తీర్చిదిద్దిన తీరు అంతగా ఆకట్టుకోలేదు. పైగా రక్తపాతం, హింస కూడా ఎక్కువైయింది. గోదావరి జిల్లాల్లో ఇలాంటి ఓ కథ జరిగిందా అని ఆశ్చర్యపోయేలా ఇందులో కొన్ని సన్నివేశాలు తీర్చిదిద్దాడు దర్శకుడు. రంగస్థలంలో కూడా హింస వుంటుంది. కానీ అది తెరపై చూస్తున్నపుడు నిజంగా ఇలా జరిగే అవకాశం ఉండొచ్చనే భావన కలుగుతుంది. పెదకాపు హింస మాత్రం అసహజంగా అనిపిస్తుంది. అయితే నాటి సామాజిక అంతరాలను , అణగారిన ప్రజల సంఘర్షణను మానవీయ కోణంలో చూపించాలనుకున్న దర్శకుడి ప్రయత్నం అభినందనీయం .
నటీనటులు:
కొత్త హీరో విరాట్ కర్ణ స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. అనుభవం వున్న నటుడిలానే కనిపించాడు. కెమరాముందు చాలా సహజంగా కదిలాడు. యాక్షన్ సన్నివేశాల్లో చాలా కష్టపడ్డాడు. తన లుక్స్ బావున్నాయి. హీరోయిన్ ప్రగతి పాత్రలో స్పష్టత కొరవడింది. ఐతే చూడటానికి అందంగా ఆ పాత్రకు సరిపోయేలా వుంది. రావురమేష్ పాత్ర ఈ సినిమాకి హైలెట్. ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానం బావుంది. తన మేనరిజం కూడా బావుంది. అలాగే బయన్నగా చేసిన నరేన్ కూడా ఆకట్టుకున్నారు. అక్కమ్మగా చేసిన అనసూయది కూడా కీలకమైన పాత్రే. కథలో మలుపు తీసుకొచ్చిన పాత్రది. తన నటన బావుంది. శ్రీకాంత్ అడ్డాల నటుడిగా సర్ప్రైజ్ చేస్తారు. వీల్ చైర్ కి అంకితమైన పాత్ర అయినప్పటికీ కళ్ళతో భయపెట్టే పాత్రలో కనిపించారు. బ్రిగడ, తనికెళ్ళభరణి, నాగబాబు, ఈశ్వరి రావు, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ వడ్లమాని పాత్రలు కూడా బావున్నాయి. మిగతా నటులు పరిధిమేర చేశారు. సినిమాలో కొన్ని సంభాషణలు ఆలోచనల్ని రేకేత్తించేలా వున్నాయి .
టెక్నికల్ :
సాంకేతికంగా సినిమాకి మంచి మార్కులు పడతాయి. చోటా కె నాయుడు కెమరాపనితనం అద్భుతంగా వుంది. జెండా పాతిన సన్నివేశం, అలాగే చుట్టూ నీరు మధ్యలో ఎండిపోయిన చెట్టు, గౌరీ పాత్ర ఉరి సన్నివేశం, గోదావరిని కొత్త కోణంలో చూపించిన విధానం ఆకట్టుకుంటాయి. పెదకాపు లో చోటా కెమరాని కొత్తగా చూడొచ్చు. అలాగే మిక్కీ జే మేయర్ నేపధ్య సంగీతం కూడా బావుంది. పాటలు మాత్రం రిజిస్టర్ కాలేదు. నిర్మాత చాలా ఖర్చు చేశారు. అది తెరపై కనిపించింది. నిర్మాణం పరంగా సినిమా ఉన్నతంగా వుంది.
ప్లస్ పాయింట్స్:
కథా నేపధ్యం, నిర్మాణ విలువలు, విరాట్ కర్ణ, రావు రమేష్, అనసూయ పాత్రలు, నేపధ్య సంగీతం
మైనస్ పాయింట్స్:
కథలో వేగం తగ్గడం, పాత్రల్లో స్పష్టత లేకపోవడం
రేటింగ్ : 2.5/5