‘ఓ సామాన్యుడు పరిస్థితులను తట్టుకొని బలవంతుడిని జయించాలంటే ఓ యుద్ధమే చేయాలి. మనం అనుకున్నది సాధించాలంటే పోరాటం తప్పితే వేరే మార్గం ఉండదు. అదే ఈ సినిమా కథ’ అన్నారు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం ‘పెదకాపు-1’. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. విరాట్కర్ణ హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఈ కథను బలంగా నమ్మాం కాబట్టే కొత్త హీరో అయినా భారీ స్థాయిలో తెరకెక్కించాం.
ఈ సినిమా మేకింగ్ విషయంలో ఎలాంటి హద్దులు విధించుకోవద్దని ముందే అనుకున్నాం. సినిమా షూటింగ్లో హీరో విరాట్కర్ణ చాలాసార్లు గాయపడ్డాడు. అయినా అంకితభావంతో శ్రమించాడు. ఈ సినిమా విడుదలైన తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు వెట్రిమారన్ స్థాయిలో పేరొస్తుంది. కుటుంబం, సమూహం, ప్రాంతం ఏదైనా కావొచ్చు..నా అనుకునే వారికి అండగా ఉండే ప్రతి ఒక్కరికి ఈ సినిమా అంకితం’ అన్నారు. ‘ఇది విరాట్ కోసం పుట్టిన కథ. పెదకాపు జర్నీ ఇంకా చాలా ఉంది. ఈ సినిమాకు ‘ఓ సామాన్యుడి సంతకం’ అనే క్యాప్షన్ ఊరికే పెట్టలేదు. కథలోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరిని కదిలిస్తాయి’ అని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలిపారు. ఈ సినిమా తనకు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిందని హీరో విరాట్కర్ణ పేర్కొన్నాడు. ఈ వేడుకలో రావు రమేష్, మల్లిడి వశిష్ట, సత్యానంద్ తదితరులు పాల్గొన్నారు.