Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 16 నుంచి ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్ఫ్తిక్స్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఓటీటీ రిలీజ్ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన కొత్త ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. థియేటర్లలో విడుదల సమయంలో వచ్చిన ట్రైలర్ కంటే ఈ కొత్త కట్ మరింత పవర్‌ఫుల్‌గా ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మాస్ ఎలిమెంట్స్‌ను మరింత బలంగా చూపిస్తూ, సినిమా హైప్‌ను కొత్తగా రీబిల్డ్ చేసినట్లు ఈ ట్రైలర్ కనిపిస్తోంది.
ఈ కొత్త ట్రైలర్ చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు భావోద్వేగానికి గురవుతూ, సోషల్ మీడియాలో తమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. “ఇలాంటి ట్రైలర్‌ను థియేటర్ల రిలీజ్‌కు ముందు వదిలి ఉంటే సినిమా ఫలితం వేరేలా ఉండేది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. కేవలం ట్రైలర్ ఎడిటింగ్ వల్లే ఫస్ట్ డే కలెక్షన్స్ 10 నుంచి 15 కోట్ల రూపాయలు పెరిగేవని కూడా చర్చిస్తున్నారు. అదే సమయంలో డైరెక్టర్ హరీష్ శంకర్ పై ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ టీమ్ ఎడిటింగ్ స్కిల్స్‌ను మెచ్చుకుంటూనే, థియేట్రికల్ ట్రైలర్ విషయంలో మేకర్స్ విఫలమయ్యారని అభిప్రాయపడుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ విషయంలో సరైన ప్రమోషన్ స్ట్రాటజీ ఫాలో కాలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
హరీష్ శంకర్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి ఇంకా మెరుగైన ఔట్పుట్ ఆశిస్తున్నామని అభిమానులు స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియా ట్రెండ్స్ కంటే కంటెంట్‌పై మరింత దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. తదుపరి సినిమాల్లో కొత్త ఆలోచనలు, బలమైన కథనం ఉంటేనే ప్రేక్షకుల అంచనాలను అందుకోగలరని అభిప్రాయపడుతున్నారు. ఇక ఓటీటీ ద్వారా ఈ సినిమా కొత్తగా ప్రేక్షకుల ముందుకు రావడంతో మళ్లీ ఆసక్తి పెరిగింది. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను వీక్షించేందుకు రెడీ అవుతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండడం మరింత ప్లస్ పాయింట్‌గా మారింది.