Bhojpuri Actor Pawan Singh | ఇటీవల పంజాబీ హీరోయిన్‌తో అనుచితంగా ప్రవర్తించి వార్తల్లోకి ఎక్కిన భోజ్‌పురి నటుడు పవన్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. పవన్ సింగ్ తనను బలవంతంగా అబార్షన్ మాత్రలు తీసుకునేలా చేశారని.. దానికి అడ్డు చెప్పినప్పుడు తీవ్రంగా హింసించారని అతడి భార్య జ్యోతి సింగ్ తెలిపింది. పవన్ సింగ్ భార్య జ్యోతి సింగ్ అతడి నుంచి విడాకులు కోరుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో భాగంగానే వీరిద్దరూ తాజాగా మీడియా ముందుకు వచ్చారు. అయితే ప్రెస్ మీట్లో భాగంగా జ్యోతి సింగ్ పవన్‌పై సంచలన ఆరోపణలు చేసింది.
తన వైవాహిక జీవితంలో జరిగిన వేధింపులు సమస్యల గురించి జ్యోతి సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ సింగ్ తనకు బిడ్డ కావాలని చెబుతాడు. కానీ నిజంగా బిడ్డ కావాలనుకునే ఏ వ్యక్తి తన భార్యకు అబార్షన్ మాత్రలు ఇవ్వడు అని జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే నేను గర్భం దాల్చిన ప్రతిసారీ నాకు అబార్షన్ మాత్రలు ఇచ్చేవాడు. గతంలో నేను చాలా విషయాలు బయటపెట్టలేదు, కానీ ఈ రోజు బయటపెడుతున్నాను. అబార్షన్ మాత్రలు తీసుకోవడానికి నో చెప్పిన ప్రతిసారి నన్ను చాలా హింసించేవాడు. అతడి హింస తట్టుకోలేక ఒకసారి తెల్లవారుజామున 2 గంటలకు 25 నిద్రమాత్రలు తీసుకున్నాను. దీంతో పవన్ సింగ్ సోదరుడు.. అతడి కుటుంబం కలిసి తనను ముంబై అంధేరిలోని బెల్లెవ్యూ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. పెళ్లి జీవితంలో తన ఆరోగ్యం, మానసిక స్థితి తీవ్రంగా దెబ్బతిన్నాయని జ్యోతి చెప్పుకోచ్చారు. పవన్ సింగ్, జ్యోతి సింగ్ మధ్య ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే జ్యోతి సింగ్ ఈ సంచలన ఆరోపణలు చేశారు.
మరోవైపు జ్యోతిసింగ్ ఆరోపణలపై పవన్ సింగ్ కూడా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ నేను ఆమెతో ఎలా ప్రవర్తించానో నాకు, ఆమెకు, దేవుడికి మాత్రమే తెలుసు అని పవన్ సింగ్ పేర్కొన్నారు.