SRK Son Aryan Khan | బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. బెంగుళూరులోని ఓ పబ్ ఈవెంట్లో ప్రజల మధ్య అశ్లీల సంజ్ఞ (మధ్య వేలు చూపడం) చేశారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. నవంబర్ 28న బెంగుళూరులోని ఓ పబ్‌లో జరిగిన ప్రైవేట్ ఈవెంట్లో ఆర్యన్ ఖాన్ ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపణ. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫిర్యాదుదారుడు తెలిపిన వివరాల ప్రకారం.. పబ్‌లో ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. ఆర్యన్ ఖాన్ చేసిన అశ్లీల సంజ్ఞ మహిళల పట్ల అగౌరవంగా ఉందని, ఇది వారి మర్యాదను కించపరిచేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై ఒక న్యాయవాది (అడ్వకేట్ ఒవైజ్ హుస్సేన్ ఎస్) పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. ‘భారతీయ న్యాయ సంహిత (BNS)’లోని సంబంధిత నిబంధనల కింద ఆర్యన్ ఖాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన కోరారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించారు. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా పోలీసులు సుమోటో విచారణ (Suo Motu Enquiry) ప్రారంభించారు. పబ్ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీని సేకరించి, దాన్ని పరిశీలించడం, ఆ ఘటన సందర్భాన్ని విశ్లేషించడం వంటి చర్యలు చేపట్టారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.