HariHara VeeraMallu | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం చారిత్రక నేపథ్యంలో రూపొందుతోంది. ‘రూల్స్ రంజన్’ ఫేమ్ జ్యోతి కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియో గ్లింప్స్, పాటలతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం చిత్రీకరణ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల మిగిలిన చిత్రీకరణ వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజా సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ మే 4 నుండి షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. మే 7-8 తేదీలలో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో మొత్తం 6 యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండగా, 20 నిమిషాల నిడివి గల ఒక యాక్షన్ సీక్వెన్స్‌ను పవన్ కళ్యాణ్ స్వయంగా రూపొందించారు. ఈ సీక్వెన్స్‌లో 1100 మంది పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ స్టూడియోలో 61 రోజుల పాటు చిత్రీకరించారు. దీని కోసం పవన్ ఎంతో కష్టపడ్డారని, అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్లతో చర్చించారని దర్శకుడు తెలిపారు. సినిమా మొత్తంలో ఇదే హైలైట్ కానుందని ఆయన పేర్కొన్నారు.
ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం మరియు నేపథ్య సంగీతం అందిస్తున్నారు.