Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీ విజయం సాధించి, విజయ్ ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఈ సరదా వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడులో నేతలు కేవలం కటౌట్లు, హోలోగ్రామ్లతో చాలా సులభంగా, సరదాగా ప్రచారం చేసి ముఖ్యమంత్రులు అయిపోయారని, కానీ తాను మాత్రం ప్రజా సమస్యల పరిష్కారం కోసం గత 15 ఏళ్లుగా రోడ్లపై తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అక్కడి రాజకీయ వాతావరణం, ఎన్నికల సరళిని చూస్తుంటే తనకు కొంత ‘అసూయ’ కలుగుతోందని ఆయన నవ్వుతూ చమత్కరించారు. ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాజకీయ పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవని స్పష్టం చేసిన ఆయన, ఒక పార్టీని నడపాలంటే లక్షలాది మంది ప్రజల అంచనాలను, భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ఎంతో అవగాహన, సమయం పడుతుందని వివరించారు. అందుకే తాను ఇన్నేళ్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పోరాటం చేయాల్సి వచ్చిందని తన రాజకీయ అనుభవాన్ని పంచుకున్నారు. కూటమి ప్రభుత్వంలో ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్.. పొరుగు రాష్ట్ర రాజకీయాలపై, తన సొంత ప్రయాణంపై చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి.