Anna Konidela | పవన్ కళ్యాణ్, అన్నా లెజీనోవాల కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో మార్క్ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. సింగపూర్‌లోనే మార్క్‌కి ప్రత్యేక వైద్యం అందించగా, ఇప్పుడు క్రమంగా కోలుకున్నారు. ఆదివారం రోజు తన భార్య, కొడుకుతో హైదరాబాద్ వచ్చారు పవన్ కళ్యాణ్ . అనంతరం తిరుపతికి చేరుకున్నారు. సోమవారం ఉదయం శ్రీవారిని ప్రత్యేకంగా దర్శించుకోనున్నారు. కొడుకు మార్క్ శంకర్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడటంతో పవన్ కళ్యాణ్ దంపతులు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని స్వామి వారి ఆశీస్సులు తీసుకోనున్నారు.
సింగపూర్ లో ఘటన జరిగిన నేపథ్యంలో తన కొడుకు ప్రాణాలతో బయటపడాలని, ఎలాంటి అపాయం జరగకూడదని పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజీనోవా శ్రీవారిని ప్రార్ధించిందట. మొక్కు ఫలించడంతో తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. అన్నా లెజినోవా మతపరంగా క్రిస్టియన్ కావడంతో ముందుగా తిరుమలలో డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేశారు. గాయత్రి సదనం లో టిటిడి ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాల పైన సంతకం చేసి ఆ తర్వాత సాధారణ భక్తుల్లాగానే కళ్యాణకట్టకు వెళ్లి తలనీలాలు సమర్పించుకున్నారు
పవన్ భార్య అన్నా స్వతహాగా క్రిస్టియన్ అయిన కొడుకు ప్రాణాల కోసం తన మతాన్ని పక్కన పెట్టి తిరుమల వెంకటేశ్వరస్వామికి మొక్కుకోవడం విశేషం. అంతేకాదు తిరుమలలో అన్నదాన కార్యక్రమానికి కొంత విరాళం కూడా ఇవ్వాలని అన్నా భావిస్తుందట. పవన భార్య చేస్తున్న పని పట్ల అభిమానులు, కార్యకర్తలే కాదు, సాధారణ జనం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బేబి ఫేమ్ ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ తన ఎక్స్ లో పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల గారు తన కుమారుడు క్షేమంగా ప్రమాదం నుండి బయటపడినందుకు స్వామివారి మొక్కులో భాగంగా తలనీలాలను సమర్పించడం జరిగినది., హిందూ మతాన్ని అనుసరించే నేను ఎంతో గర్వపడుతున్నాను మేడం. సనాతన ధర్మాన్ని భర్త పరిరక్షిస్తుంటే, అన్యమతం నుండి వచ్చి హిందూ మతాన్ని ఇంతలా గౌరవిస్తున్న మీ మనస్తత్వాన్ని ఖచ్చితంగా అభినందించాలి అని ఆయన ట్వీట్ చేశారు.