ఈ ఏడాది విడుదల కానున్న భారీ పాన్ ఇండియా సినిమాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. అగ్ర హీరో పవన్‌కల్యాణ్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. జూన్ 12న సినిమా విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని మేకర్స్ చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాలోని మూడో గీతం కూడా విడుదల కానున్నదని, అలాగే.. ట్రైలర్‌ని కూడా విడుదల చేస్తామని, సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చేలా ట్రైలర్ ఉండబోతున్నదని వారు తెలిపారు.
వెండితెరపై మునుపెన్నడూ చూడని అద్భుతాన్ని ప్రేక్షకులకు అందించాలనే దృక్పథంతో దర్శకుడు ఎ.ఎం.జ్యోతికృష్ణ అవిశ్రాంతంగా ఈ సినిమాకోసం శ్రమిస్తున్నారని చిత్ర నిర్మాత ఎ.దయాకర్‌రావు తెలిపారు. పవన్‌కల్యాణ్ కెరీర్లో తొలిసారి జానపద వీరుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా బాబీ డియోల్ కనిపించనున్నారు. నిధి అగర్వాల్ ఇందులో కథానాయిక. అనుపమ్‌ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సమర్పణ: ఎ.ఎం.రత్నం, నిర్మాణం: మెగా సూర్య ప్రొడక్షన్స్.