Pawan Kalyan | అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి అరుదైన ఘనత సాధించాడు. సినీరంగంలో ఆయన అందించిన సేవలకు గాను యూకే పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్ ఆయనను ఘనంగా సన్మానించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందజేసింది. గత నాలుగున్నర దశాబ్దాలుగా సినిమా రంగం ద్వారా కళలకు, సమాజానికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ఆయనకు లభించింది. అయితే తన అన్నయ్యను యూకే పార్లమెంట్ సన్మానించడంపై తాజాగా ప్రత్యేక పోస్ట్ పెట్టాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
యూకే పార్లమెంట్ అందించిన లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో అన్నయ్య చిరంజీవి కీర్తి మరింత పెరిగింది. సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి, స్వశక్తితో, కళామతల్లి దీవెనలతో, చిత్ర రంగంలో మెగాస్టార్‌గా ఎదిగి, నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తూ, తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకుని, నటనకు పర్యాయపదంగా నిలిచిన వ్యక్తి. ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటాను.
నేను చిరంజీవి గారిని ఒక అన్నయ్య గా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను. నేను జీవితంలో ఏం చేయాలో తెలియక, అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి ఆయన. నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి గారు. తన సేవా భావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్నవారికి రక్తదానం, నేత్రదానం అందిస్తూ, నన్నే కాకుండా కోట్లాదిమంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత మా అన్నయ్య శ్రీ కొణిదల చిరంజీవి గారు. తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా, ఎంతోమంది ఎదుగుదలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తూ, టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలిచారు. ఆయన సమాజానికి అందించిన సేవలకు గాను ఇటీవలే భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పురస్కారాన్ని గౌ|| రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్మూ చేతుల మీదుగా అందుకున్నారు.
యూకే పార్లమెంట్ పద్మవిభూషణ్ డా. మెగాస్టార్ చిరంజీవి గారికి, ఈనెల 19న జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకుని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పురస్కార కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న స్టాక్ పోర్ట్ ఎంపీ శ్రీ నవేందు మిశ్రా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.