Pawan Kalyan | ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడు సింగపూర్ లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో శంకర్ చేతులకి, కాళ్లకి గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తులోకి కూడా పొగ చేరడంతో ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ రోజు ఉదయం మార్క్ శంకర్‌ని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, కొణిదెల సురేఖ సైతం సింగపూర్ చేరుకున్నారు. తాజాగా మార్క్ శంకర్ హెల్త్ గురించి అందరు ఆందోళన చెందుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ టీమ్ మార్క్ శంకర్ హెల్త్ అప్ డేట్ విడుదల చేసింది.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి సింగపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళిన శ్రీ పవన్ కల్యాణ్ గారు నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. మార్క్ ను చూశారు. చేతులు, కాళ్ళకు కాలిన గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. అక్కడి వైద్యులు, అధికారులతో మాట్లాడారు. మార్క్ కోలుకొంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని తెలియచేశారు.
భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చారు. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియచేశారు అంటూ జనసేన పార్టీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం చిన్నారికి బ్రోన్కో స్కోపీ చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రోన్కో స్కోపీ అనేది ఊపిరితిత్తుల లోపలి భాగాలను, ముఖ్యంగా వాయునాళాలను ట్రాకియా, బ్రాంకీ మరియు బ్రాంకియోల్స్ పరిశీలించడానికి చేసే వైద్య పరీక్ష/చికిత్స. దీన్ని బ్రోన్కోస్కోప్ అనే ప్రత్యేకమైన నాజూకైన పొడవైన కెమెరా పరికరంతో చేస్తారు. ఊపిరితిత్తుల లోపలి భాగాల్లో ఉన్న అసహజ గడ్డలు లేదా ఫంగస్, ఇన్ఫెక్షన్లు పరిశీలించడానికి. అదేవిధంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, ట్యూమర్లను గుర్తించడానికి చేస్తారు.