Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఎక్కువగా ప్రజల మధ్య ఎక్కువగా ఉంటూ వారి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అయితే రాజకీయాలతో బిజీగా ఉండడం వలన గతంలో మాదిరిగా ఇప్పుడు పవన్ సినిమాలు చేసే పరిస్థితి లేదు.కాకపోతే గతంలో ఆయన ఒప్పుకున్న ప్రాజెక్ట్‌లని ఇప్పుడు శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. అందులో భాగంగానే హరి హర వీర మల్లు సినిమా షూటింగ్ ను పూర్తి చేయగా, ఈ మూవీ అన్ని హంగులు పూర్తి చేసుకొని జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక దీని తర్వాత ఓజీని పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్. ఇటీవల షూటింగ్ మళ్లీ మొదలు పెట్టినట్లు చిత్ర బృందం కూడా ప్రకటించింది.
సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్నట్టు తెలుస్తుండగా, వీలైనంత త్వరగా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు మేకర్స్. అయితే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ అధికారికంగా ప్రకటించింది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను సెప్టెంబర్ 25న దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందం మాములుగా లేదు. జూన్ 12న హరిహర వీరమల్లుతో పవన్ పలకరించనుండగా, షార్ట్ గ్యాప్‌తో ఓజీతో రచ్చ చేయనున్నాడు. ఏది ఏమైన ఈ అప్డేట్స్తో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
ఇప్పటికే విడుదలైన ‘ఓజీ’ టీజర్ సినిమాపై అంచనాలను ఓ రేంజ్లో పెంచేసింది. పవన్ కల్యాణ్ లుక్, టీజర్‌లోని యాక్షన్ సన్నివేశాలు చూసిన అభిమానులు మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దసరా పండుగ సీజన్లో ఓజీ రానుండడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.