Pawan Kalyan | బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. రాజకీయాలతో బిజీగా ఉండడం వలన పవన్ కళ్యాణ్ కమిటైన సినిమాలపై దృష్టి సారించలేకపోతున్నారు. ఇక ఈ మధ్య రెండు సినిమాల షూటింగ్ పూర్తి చేసి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై ఫోకస్ పెట్టారు.అయితే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12న విడుదల కావల్సి ఉండగా, పలు కారణాల వలన వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా మూవీగా హరిహర వీరమల్లు రూపొందింది. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందించగా, ప్రస్తుతం స్క్రీన్‌ప్లే రచయిత జ్యోతి కృష్ణ సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. ఇందులో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటించింది.
ఈ ప్రాజెక్ట్ 2019లోనే ప్రారంభమైంది. కానీ కరోనా, పవన్ రాజకీయ షెడ్యూల్, షూటింగ్లో జాప్యాలు వంటి అనేక కారణాల వల్ల ఈ సినిమా దాదాపు ఐదు సంవత్సరాలుగా సెట్స్ పైనే ఉంది. ఇక ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ట్రైలర్ ఫైనల్ కట్ లాక్ అయినట్టు తెలుస్తుంది. మేకర్స్ ఈ వారం లేదా వచ్చే వారం ప్రారంభంలోనే ట్రైలర్‌ను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్లకు విశేష స్పందన వచ్చిన నేపథ్యంలో ట్రైలర్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ట్రైలర్ విడుదలతో సినిమా కథ, స్క్రీన్‌ప్లే, విజువల్స్ ఎలా ఉండబోతున్నాయన్న దానిపై స్పష్టత రానుంది. చిత్రాన్ని జూలై 24న విడుదల చేయనున్నారు.
పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో 17వ శతాబ్దం మొఘల్ యుగంలో పోరాటయోధుడిగా, రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నారు. పాత్రకు తగ్గట్లే పవన్ ప్రత్యేక శిక్షణ తీసుకుని, ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాల్లో నటించినట్లు సమాచారం. ఇంకా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించడం మరో విశేషం. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోందని చిత్ర బృందం చెబుతోంది. తెలుగు తో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో, సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటారా లేదా అన్నదే ఆసక్తికర అంశంగా మారింది. అయితే ట్రైలర్ విడుదలతో సినిమా మీద హైప్ మరింతగా పెరిగే అవకాశముంది.