Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ గతంలో ఒప్పుకున్న సినిమాలని పూర్తి చేసి ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉండనున్నారు. పవన్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా, మూవీ కాస్త నిరాశపరిచింది. ఇక సెప్టెంబర్‌లో ఓజీ చిత్రంతో పలకరించనున్నాడు. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్‌తో బాక్సాఫీస్‌ని కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు పవర్ స్టార్ .అయితే పవన్ కళ్యాణ్ తన కెరీర్ ఆరంభంలో ఎక్కువగా ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకుల మనసులు గెలిచారు. తొలిప్రేమ , సుస్వాగతం , ఖుషి వంటి సినిమాలు ఆయనకు స్టార్ డమ్ తీసుకువచ్చాయి.
ఆ రోజుల్లో తన సినిమాల్లో యాక్షన్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, మార్షల్ ఆర్ట్స్ సన్నివేశాలపై ప్రత్యేక ఆసక్తి చూపేవారు. చాలాసార్లు రియల్ స్టంట్స్ కూడా చేశారు. ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్, తన కెరీర్లో అత్యంత ఎమోషనల్‌గా స్పందించిన సీన్ గురించి వెల్లడించారు. అది సుస్వాగతం సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశం. తండ్రి చనిపోతే ఒక కొడుకు ఎమోషన్ ఎలా ఉంటుందో చూపించాల్సిన సీన్ అది. డైరెక్టర్ చెప్పిన దాని కన్నా ఎక్కువగానే ఏడ్చేశాను. ఆ ఎమోషనల్ సీన్ బాగా రావాలని దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు చెప్పారు. అందుకే నేను నాకు నేనే చెంపలపై కొట్టుకుని ఏడ్చాను. ఫలితంగా తల నొప్పి కూడా వచ్చింది అని పవన్ చెప్పుకొచ్చారు.
ఆ క్లైమాక్స్ సీన్ తీయడం కోసం పవన్ కళ్యాణ్ రోజంతా ఏమీ తినకుండా ఉన్నారని, దర్శకుడు భీమినేని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అవసరమైన ఎమోషన్ కోసం ఆయన చూపించిన డెడికేషన్ ఆ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన అన్నవరం కథని తొలుత చిరంజీవికి ఆఫర్ చేశారు. కానీ మెగాస్టార్, “ఈ కథ నా కంటే పవన్‌కు బాగా సరిపోతుంది అని చెప్పారు. దీంతో భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ హీరోగా అన్నవరం రూపొందింది. అయితే ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ తిరుప్పాచ్చి కి రీమేక్ అయినప్పటికీ, ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. పవన్ కళ్యాణ్ నటనలోకి వచ్చిన కొత్త రోజుల్లోనే తన పాత్రల్లో డెడికేషన్, భావోద్వేగం, యాక్షన్ వంటివి చూపించి అందరి మనసులు గెలిచారు.ఇప్పుడు ఆయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.