Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన పాన్-ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. చిత్ర రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఈ క్రమంలో సోమవారం నాడు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి రావడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. అలానే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్, కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా కార్యక్రమంలో సందడి చేశారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఈ వేడుకకు అనుమతి ఇచ్చిన సీఎంకి ధన్యవాదాలు అని తెలియజేశారు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. నేను రికార్డుల కోసం సినిమాల్లోకి రాలేదు. నటన నా లక్ష్యం కాదు. ఒక సాధారణ వ్యక్తిగా జీవించాలన్నదే నా కోరిక. నా గుండెల్లో అభిమానులు తప్ప ఎవరూ లేరు. ఆయుధాలు, గూండాలు నాతో లేరు. వయసు పెరిగింది కానీ, గుండెల్లో చావ చావలేదు.డబ్బుకంటే బంధాలకే ప్రాముఖ్యత ఇచ్చాను. హరిహరవీరమల్లును చాలా కష్టాల్లో చేశా. పేరున్నా, ప్రధాని తెలిసినా డబ్బులు రావు. సినిమాతో అభిమానులను ఆకట్టుకోవాలన్నదే నా ఆశయం.
తన గతాన్ని గుర్తుచేస్తూ, “ఫ్లాప్ తర్వాత ఇండస్ట్రీలో నాకు గ్రిప్ రాలేదు. అప్పుడే త్రివిక్రమ్ వచ్చి మళ్ళీ నన్ను నిలబెట్టాడు. అతను నా మిత్రుడు, ఆత్మబంధువు,” అని అన్నారు పవన్. క్రిష్ వ్యక్తిగత కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు అని కూడా పేర్కొన్నారు. ఈ సినిమాకి కీరవాణి బలంగా నిలిచాడు. ఆయన అంకితభావం వల్లే సినిమా నడిచింది. డైరెక్టర్ జ్యోతికృష్ణను ఖుషీ టైమ్ నుంచి తెలుసు. రోజుకి రెండు గంటలు, వారానికి ఐదు రోజులు షూటింగ్‌కి ఇచ్చా. నిధిని చూసి నేనూ ప్రమోషన్లకి వచ్చా. హీరో నెనే కాబట్టి మీడియా ఇంటరాక్షన్ చేస్తున్నా. ప్రభుత్వం మనదే అయ్యింది, మన సినిమా రిలీజ్ అవుతుంది అని పవన్ అన్నారు. హరిహరవీరమల్లు కల్పిత పాత్రే కానీ, ఓ సగటు వ్యక్తి ఎంత సాధించగలడో చూపించే కథ. కోహినూర్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ కథ మొదలైంది. మొఘల్‌ల అరాచకాలపై చరిత్ర మాట్లాడలేదు. ఛత్రపతి శివాజీలా ధర్మ పోరాటం చెబుతుంది ఈ సినిమా. ఈ సినిమా కోసం డ్యాన్స్ కూడా చేశాను. బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చాను. మళ్లీ విశాఖపట్నంలో కలుద్దాం అంటూ పవన్ తన స్పీచ్ ముగించారు.