అగ్ర హీరో పవన్‌కల్యాణ్ నటిస్తున్న తొలి జానపద చిత్రం ‘హరిహర వీరమల్లు’. చారిత్రాత్మక పాత్రలతో కూడిన ఈ ఫిక్షన్ డ్రామాలోని కొంతభాగాన్ని క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమాకు దర్శకుడు జ్యోతికృష్ణ. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్‌రావు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా పానిండియా స్థాయిలో విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా సోమవారం ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చేశారు.
‘కోరకోర మీసాలతో కొదమ కొదమ అడుగులతో.. కొంటె కొంటె చెణుకులతో.. కొలిమి లాంటి మగటిమితో.. సరసర వచ్చినాడు చిచ్చరపిడుగంటివాడు.. ఏదో ఏదో తలచినాడు.. ఎవ్వరినో వెతికినాడు.. ఎవరంట.. ఎవరంట..’ అనే కోరస్‌తో ఈ పాట మొదలైంది.. ‘కొండపల్ల్లి ఎండిబొమ్మా.. కోలకళ్లతో చూసిందమ్మా.. తీయతియ్యని తేనెలకొమ్మా.. తీయని తెరలే తీసిందమ్మా.. వజ్రాల జిలుగులున్నా.. రత్నాల ఎలుగులున్నా.. కెంపుల్లా ఒంపులున్నా.. మొహరీల మెరుపులున్నా.. నా పైడి గుండెల్లోన యేడి పుట్టించీ.. మరిగించి మరిగించి.. కరిగించి కరిగించి.. కొల్లగొట్టి నాదిరో.. కొల్లా గొట్టి నాదిరో..’ అంటూ జానపద శైలి సాహిత్యంతో, మాస్ మెచ్చే బీట్తో పాట సాగింది.
చంద్రబోస్ రాసిన ఈ పాటను ఎం.ఎం.కీరవాణి స్వరపరచగా, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా ఆలపించారు. ఇది పానిండియా సినిమా కావడంతో వివిధ భాషల్లో వివిధ గాయనీగాయకులు ఈ పాటను పాడగా, తమిళంలో పా.విజయ్, మలయాళంలో మంకొంబు గోపాలకృష్ణన్, కన్నడంలో వరదరాజ్, హిందీలో అబ్బాస్ టైరేవాలా సాహిత్యం అందించారు. పవన్‌కల్యాణ్, నిధి అగర్వాల్‌పై చిత్రీకరించిన ఈ పాట అభిమానుల్ని అలరించేలా కలర్ఫుల్గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ నృత్యాలు ఈ పాటకు అదనపు ఆకర్షణ. 17వ శతాబ్దపు మొగల్ సామ్రాజ్య నేపథ్యంలో భారీ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాబిన్‌హుడ్ తరహా పాత్రలో పవన్‌కల్యాణ్ కనిపిస్తారు. బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్, సమర్పణ: ఏ.ఎం.రత్నం.