‘Priya Prakash Varrier | నాది సినిమా నేపథ్యమున్న కుటుంబం కాదు. నన్ను సరైన మార్గంలో గైడ్ చేసేవాళ్ళు లేరు. కన్నుగీటే వీడియోతో పాపులరైన తరువాత నాకు అందరూ రకరకాల సలహాలు ఇవ్వడంతో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాను’ అన్నారు కథానాయిక ప్రియా ప్రకాష్ వారియర్. తెలుగులో ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రో’. పవన్‌కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో రూపొందుతున్న ఈ చిత్రానికి పి.సముద్రఖని దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ప్రియా ప్రకాష్ వారియర్ విలేకరులతో ముచ్చటించి ‘బ్రో’ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ ‘కెరీర్ ప్రారంభంలోనే పవన్‌కల్యాణ్ లాంటి గొప్ప నటుడితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాలో ఆయన కాంబినేషన్లో నాకు సన్నివేశాలున్నాయి. ఆయన తన నటనతో మ్యాజిక్ చేస్తారు. గత చిత్రాలతో పోలిస్తే నేను ఈ చిత్రంలో కొత్తగా కనిపిస్తాను. ఇందులో నా పాత్ర పేరు వీణ.
హోమ్లీ గర్ల్ లాంటి పాత్ర. తప్పకుండా ఈ చిత్రం నా కెరీర్లో గుర్తుండిపోతుంది. మాతృకతో పోలిస్తే ‘బ్రో’ సినిమాలో చాలా మార్పులు చేశారు. పవన్‌కల్యాణ్ గారి ఇమేజ్‌కు తగ్గట్టుగా, సినిమాలో సోల్ మిస్ అవ్వకుండా మార్పులు చేశారు. చాలా కొత్త సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఇదొక మంచి కుటుంబ కథా చిత్రం. అందరి హృదయాలకు హత్తుకునే సినిమా ఇది. నా కెరీర్ ఇప్పుడు సరైన దిశగా ప్రయాణిస్తున్నది. పాత్రలు, సినిమాల ఎంపిక విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు గొప్ప నటి కావాలని ఆశ ఉండేది. ఆ దిశగానే నా అడుగులు సాగుతున్నాయి’ అని చెప్పింది.