రీసెంట్గా వచ్చిన పవన్‌కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా ఓ ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. దానికి కారణం వీరమల్లు.. ఉన్నవాళ్లను కొట్టి, లేనివాళ్లకు పెట్టే రాబిన్‌హుడ్. కథాగమనంలో మొగల్ సింహాసనంపై ఉండే కోహినూర్ వజ్రం ఈతని లక్ష్యం అవుతుంది. ఈ కారణంగా మతోన్మాద చక్రవర్తి ఔరంగజేబును ఢీకొట్టాల్సి వస్తుంది. చరిత్రలోకి తొంగిచూస్తే.. ఔరంగజేబు ఉన్నాడు. గొల్కొండ నవాబు తానీషా ఉన్నాడు. కానీ, వీరమల్లు లేడు. అదొక కల్పిత పాత్ర. చరిత్రలో ఉన్న పాత్రల్ని తీసుకొని అల్లుకున్న ఓ ఫిక్షన్ ఈ కథ. హిస్టారికల్ ఫిక్షన్ అన్నమాట! ఇలాంటి కథలు తెలుగు తెరపై గతంలోనూ వచ్చాయి. వాటిలో కొన్ని పాత్రలు నేటికీ గుర్తున్నాయి.
కమ్మటి పప్పు కథ అయితే.. కాచిన నెయ్యి ఫిక్షన్. రెండూ కలిస్తే మహత్తరం. అందుకే.. ఏ కథకైనా కాస్తంత కల్పన అవసరం అంటారు రచయితలు. ఇది ఇప్పటి మాట కాదు.. యుగాలనాటిది. గతంలో శకుంతల కథను ఉన్నదున్నట్టు రాస్తే భోజరాజుగారికి ఎక్కలేదంట. ‘దుష్యంతుణ్ని ఎందుకు తక్కువ చేయడం.. రాజు మంచివాడైతే ఎలా ఉంటుందో ఊహించి రాస్తే సరి..’ అని కాళిదాసుకు సలహా పారేశారట భోజరాజు. దాంతో దుశ్యంతుడికి దుర్వాసుడి శాపం తోడైంది. ఆ విధంగా ‘అభిజ్ఞాన శాకుంతలం’ పుట్టింది. భారతీయ కావ్యాల్లో తొలి ఫిక్షన్ బహుశా అభిజ్ఞాన శాకుంతలమే కావొచ్చు!!
ఇక దాన్ని ఆదర్శంగా తీసుకున్న ఔత్సాహిక అక్షరయోధులు చెలరేగిపోయారు. ఒక్క పురాణాలేంటి! చరిత్రను కూడా వదల్లేదు. వరుసపెట్టి కల్పనలతో అద్భుతాలనే సృష్టించేశారు. జనప్రియమైన పాత్రల చుట్టూ అల్లిన కథలు కావడం వల్ల కావొచ్చు.. అవన్నీ అద్భుతమైన ప్రజాదరణ పొందాయి. వాటిలో ప్రథమంగా చెప్పుకోవాల్సిన ప్రయత్నం ‘శ్రీరామాంజనేయ యుద్ధం’.
కలలో సైతం రామనామం తప్ప వేరొకటి తలవని ఆంజనేయుడు.. ఆ రాముడ్నే ఎదిరిస్తే? ఈ సాహసోపేతమైన ఆలోచన నుంచి పుట్టిందే ‘శ్రీరామాంజనేయ యుద్ధం’. తల్లికిచ్చిన మాట కోసం ఈ కథలో రాముడ్నే ఎదిరిస్తాడు హనుమ. తల్లిని మించిన దైవం లేదని ఓ వైపు చెబుతూ.. మరోవైపు రామనామం గొప్పదా? రామబాణం గొప్పదా? అనే కాన్ఫ్లిక్ట్ని యాడ్ చేసి, జనాన్ని ఊపిరాడకుండా చేశాడు రచయిత తాండ్ర సుబ్రహ్మణ్యం. ఈ కల్పన ముందు నాటకంలా వచ్చి బహుళ ప్రజాదరణ పొందింది.
ఆ తర్వాత.. ఎన్టీఆర్ రాముడిగా, అర్జా జనార్దన్‌రావు ఆంజనేయుడిగా బాపు దర్శకత్వంలో సినిమాగా విడుదలై.. అలా కూడా అద్భుత విజయాన్ని అందుకుంది.
ఇక రెండు తనువులు, ఒకే ప్రాణమై మెలిగిన కృష్ణార్జునులు కొట్టుకుంటే ఎలా ఉంటుంది?.. చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు నుంచి పుట్టిన ఈ చిలిపి ఆలోచనే ‘గయోపాఖ్యానం’. నేటికీ రంగస్థలంపై ఎక్కువగా ప్రదర్శితమయ్యే నాటకాల్లో ఇదొకటి. టాలీవుడ్ కృష్ణార్జునులైన ఎన్టీఆర్, ఏఎన్నార్లతో దర్శకుడు కేవీరెడ్డి ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’(1963) అని ఈ కథను సినిమాగా తీస్తే.. అది కూడా ఘన విజయాన్ని అందుకుంది. ఈ వరుసలోనే మన సినిమా వాళ్లు త్రేతాయుగానికీ, ద్వాపరయుగానికీ లింకు పెట్టేసి, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, భీమాంజనేయ యుద్ధం అంటూ అభూత కల్పనలు అల్లేశారు.
ఇక ‘హరిహర వీరమల్లు’ తరహాలో తెలుగులో వచ్చిన హిస్టారికల్ ఫిక్షన్స్ విషయానికొస్తే.. తెలుగులో వచ్చిన తొలి చారిత్రక కాల్పనిక సినిమా ‘మల్లీశ్వరి’ (1951). ఓసారి దర్శకుడు బీఎన్ రెడ్డి హంపీ వెళ్లారట. అక్కడి ఆదినారాయణమూర్తి ఆలయంలోని శిల్ప సంపదను, సౌందర్యాన్నీ తిలకించి భావోద్వేగానికి లోనయ్యారట. ఈ శిల్పకళల నేపథ్యంలోనే ఓ అందమైన ప్రేమకథ అల్లితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన ఆయనకు అక్కడే తట్టింది. అంతే.. ఆలస్యం చేయకుండా.. రాయలవారి కాలంలోని ‘రాణీవాసం’ అనే అనాచారాన్ని ఆయుధంగా చేసుకొని, భువన విజయం సాక్షిగా ‘మల్లీశ్వరి’ అనే కథ రాసేశారు బీఎన్ రెడ్డి. దాన్ని ఆయన తెరకెక్కిస్తే.. అందులో నాగరాజుగా ఎన్టీఆర్, మల్లీశ్వరిగా భానుమతి రామకృష్ణ జీవించేశారు. ఇక సాలూరివారి పాటలు, రెడ్డిగారి దర్శకత్వ ప్రౌఢీ ‘మల్లీశ్వరి’ని క్లాసిక్‌గా నిలబెట్టాయి. 1956లో వచ్చిన ‘తెనాలి రామకృష్ణ’ కూడా ఓ విధంగా ఫిక్షనే. రామకృష్ణ కవికి ‘వికటకవి’ అనే బిరుదు అమ్మవారి వరంవల్ల వచ్చినట్టు, బాబరు సైన్యం నుంచి, రాయల సామ్రాజ్యాన్ని రామకృష్ణ కవే కాపాడినట్టు ఆ సినిమాలో చూపించారు. నిజానికి అది జరిగినట్టు చారిత్రక ఆధారాలు ఎక్కడా లేవు.
అలాగే.. బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిత్య 369’ ఓ సైంటిఫిక్ హిస్టారికల్ ఫిక్షన్. తెరపై హీరోహీరోయిన్లనే కాదు, తెర ముందు కూర్చొని చూస్తున్న ప్రేక్షకుల్ని కూడా టైమ్ మిషిన్ ఎక్కించేసి రాయలవారి కాలానికి తీసుకెళ్లారు దర్శకుడు సింగీతం. తెలుగుసినిమా చరిత్రలో ‘ఆదిత్య 369’ ఓ అద్భుతం.
ఇక విభిన్నమైన హిస్టారికల్ ఫిక్షన్ చిరంజీవి ‘శంకర్‌దాదా జిందాబాద్’. ఇందులో శంకర్ అనే దాదాను మహాత్మాగాంధీ మనిషిని చేస్తాడు. బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ ‘లగేరహో మున్నాభాయ్’ ఈ సినిమాకు మాతృక. మూడేళ్ల క్రితం వచ్చిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ కూడా హిస్టారికల్ ఫిక్షనే. ఒకేకాలంలో వేరువేరు ప్రాంతాల్లో పేరెన్నికగన్న యోధులు అల్లూరి, కుమ్రం భీమ్‌లు.. తమ పోరాటాల్లో భాగంగా ఒకేచోట కలిస్తే?.. వారిద్దరూ తలపడితే.. కాలక్రమంలో మిత్రులుగా మారితే?.. అనే అబ్బురపరిచే ఊహకు తెరరూపమే ‘ఆర్ఆర్ఆర్’. ఆస్కార్ దాకా వెళ్లిన ఫిక్షన్ ఇది. ఇప్పుడు అదే దారిలో తయారైన సినిమా పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’.
ఇందులో ఆయన రాబిన్‌హుడ్ తరహా పాత్ర చేశారు. అలాంటి పాత్రలు గతంలో ఎన్నో వచ్చాయి. ఈ కోవలో వచ్చిన తొలి సినిమా ఎన్టీఆర్ ‘జయం మనదే’ (1956). ఇందులో ఎన్టీఆర్ పాత్ర పేరు ప్రతాప్. ఉన్నవాళ్లను కొట్టి లేనివాళ్లకు పెట్టే రాబిన్‌హుడ్ అన్నమాట. ఈ తరహా పాత్రలు తెలుగులో ఎక్కువగా పోషించిన హీరో కూడా ఎన్టీఆరే. రేచుక్క, బందిపోటు, బాగ్దాద్ గజదొంగ.. ఇత్యాది చిత్రాల్లో ఎన్టీఆర్ రాబిన్‌హుడ్‌గా కనిపించారు. ‘మహాసంగ్రామం’లో సూపర్‌స్టార్ కృష్ణ, ‘కొండవీటి దొంగ’లో చిరంజీవి ఇలాంటి పాత్రలే పోషించారు.
చివరిగా.. హీరో కోసం అభిమానులొస్తారు. కామన్‌మ్యాన్ మాత్రం కంటెంట్ కోసం మాత్రమే వస్తాడు. కథ కల్పితమైనా జనరంజకంగా తీస్తే కాసుల వర్షం పక్కా. ఫిక్షన్ కథల్లో ఉండే మజా అలాంటిది మరి. ఈ తరహా కథలు ముందు ముందు ఎన్నొస్తాయో చూడాలి!!
– బుర్రా నరసింహ