Pawan Kalyan fans threw confetti | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీర మల్లు’ చిత్రం లండన్‌లోని ఓ థియేటర్లో ప్రదర్శితమవుతుండగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సినిమా స్క్రీనింగ్ సమయంలో కొందరు అభిమానులు కాన్ఫెట్టి (రంగు కాగితాలు) చల్లడంతో, థియేటర్ సిబ్బంది వెంటనే స్క్రీనింగ్‌ను నిలిపివేశారు. గురువారం ఈ సినిమా విడుదల కాగా.. యూకేలోని ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్లో ‘హరి హర వీర మల్లు’ సినిమాను ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ సినిమాను చూడటానికి వెళ్లిన అభిమానులు తమ హీరోపై అభిమానాన్ని చాటుకునేందుకు థియేటర్ లోపల కాన్ఫెట్టి చల్లడం మొదలుపెట్టారు. జనరల్‌గా మన ఇండియాలో తమ హీరోలకు ఇలాంటివి చల్లడం మనకు కనిపిస్తునే ఉంటాయి. అయితే విదేశాల్లోని థియేటర్లలో ఇలాంటి వాటికి అనుమతిలేదు. ఒకవేళ ఇలా పేపర్లు చింపి వేయాలి అనుకుంటే ముందుగానే థియేటర్ యాజమాన్యం వద్ద అనుమతిని తీసుకోవాలి. అయితే పవన్‌పై అభిమానం చూపేందుకు కాన్ఫెట్టిని చల్లిన అభిమానులపై థియేటర్ సిబ్బంది సీరియస్ అయ్యింది. దీంతో వెంటనే స్పందించి సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. కాన్ఫెట్టి చల్లిన అభిమానులను థియేటర్ నుండి బయటకు వెళ్లిపోవాలని, ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక వైరల్ అవుతున్న వీడియోలో, థియేటర్ సిబ్బంది అభిమానులతో వాదిస్తూ కనిపించారు. మీరు ఇలాంటివి చేయాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి అని సిబ్బంది చెప్పగా, అభిమానులు మాత్రం తమకు అలాంటి నిబంధనలు ఉన్నాయని ఎటువంటి నోటీసు బోర్డులు కనిపించలేదని వాదించారు. కొందరు అభిమానులు థియేటర్లోని సౌండ్ సిస్టమ్ సరిగా లేదని కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం. కాన్ఫెట్టి వల్ల థియేటర్‌ను శుభ్రం చేయడం కష్టమవుతుందని సిబ్బంది వివరించినా, అభిమానులు దాన్ని పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. థియేటర్ సిబ్బంది చర్యను చాలా మంది సమర్థిస్తుండగా, మరికొందరు అభిమానుల అత్యుత్సాహం వల్ల ఇతరులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శిస్తున్నారు. విదేశాల్లో సినిమా హాళ్లలో ఇలాంటి ప్రవర్తన సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Pawan Kalyan fans threw confetti during the screening of #HariHaraVeerMallu in UK.
The screening was immediately stopped and the staff confronted them. pic.twitter.com/fybKKFojox
— 👑Che_Krishna🇮🇳💛❤️ (@CheKrishnaCk_) July 24, 2025