AM Ratnam | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. తాను కమిటైన సినిమాలు కొన్ని పెండింగ్‌లో ఉండడంతో వాటిని పూర్తి చేసే పనిలో పడ్డారు. 2023లో ‘బ్రో’ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తోన్న చిత్రం ‘ హరిహర వీరమల్లు ’ కాగా, ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. సుమారు ఐదేళ్లుగా సెట్స్ మీదున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జులై 24న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా చిత్రం ఇది కాగా, ఇందులో పవన్ చారిత్రక యోధుడిగా కనిపించి సందడి చేయనున్నారు.
ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ సినిమాని మరింత ప్రమోట్ చేసే క్రమంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రెస్ మీట్ ఏఎం రత్నం కోసమే ఏర్పాటు చేశానని అన్నారు. ఆయన నలిగిపోతుంటే చూడలేక తన వంతు సపోర్ట్ అందించినట్టు పేర్కొన్నారు.
సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తనకు తెలియదని, ఈ ప్రెస్‌మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏఎం రత్నమే అని పవన్ అన్నారు. సినిమాను రూపొందించాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలన్నారు. రీజనల్ సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తి రత్నం అంటూ కొనియాడారు. ఇక తాను ఏఎం రత్నం ని ఏపీ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ గా చేయమని ముఖ్యమంత్రికి ప్రతిపాదించినట్టు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ‘భవిష్యత్తులో అవ్వొచ్చు.. అన్ని మన చేతిలో ఉండవు కదా అని పవన్ చెప్పడం కొసమెరుపు. ఇక ఈ రోజు సాయంత్రం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండగా, ఈ కార్యక్రమంలో పవన్ ఎలాంటి కామెంట్స్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.