Bro Movie Latest Update | నిన్న మొన్నటి వరకు పెద్దగా అంచనాల్లేని వినోదయ సిత్తం రీమేక్‌పై ఇప్పుడు ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. మూడు వారాల క్రితం విడుదలైన మోషన్ పోస్టర్ సినిమాపై తిరుగులేని హైప్ క్రియేట్ అయింది. ఫస్ట్‌లుక్ పోస్టరే ఈ రేంజ్లో దింపితే సినిమా ఇంకా ఏ లెవల్లో ఉంటుందన్న ఊహే పవన్ అభిమానుల్లో జోష్ నింపుతుంది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలోఉంది. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లతో సినిమాపై మంచి అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన బిగ్ న్యూస్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
తాజాగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన టాకీ పార్టు మొత్తం పూర్తయిందని సమాచారం. పాట, ఫైట్ తో సహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందట. ఇక డబ్బింగ్ పార్టు మాత్రమే మిగిలుందని టాక్. ఇక ఈ సినిమా మొత్తం పవన్ సరికొత్త లుక్ లో దర్శనమివ్వబోతున్నాడు. తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన సముద్రఖని రీమేక్ వెర్షన్ కూడా తెరకెక్కిస్తున్నాడు. ఒక యాక్సిడెంట్లో చనిపోయిన ఓ వ్యక్తి.. తాను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని, దానికి మూడు నెలలు సమయం కావాలని తననీ పైకి తీసుకెళ్లడానికి వచ్చిన దేవుడిని ఓ వరం అడుగుతాడు. దానికి దేవుడు ఒప్పుకోవడమే కాకుండా ఆ మూడు నెలలు ఇక్కడే ఉండి ఆ వ్యక్తితో ప్రయాణిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చనిపోయిన వ్యక్తి తాను అనుకున్న పనులను పూర్తి చేశాడా? అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్లు పలు మార్పులు చేర్పులు చేస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా సంస్థ నిర్మిస్తుంది.