Pawan- Dil Raju | పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, సినిమా ఇండస్ట్రీపై ఫోకస్ పెడుతూనే ఉన్నారు. ఇటీవల పవన్ నటించిన ఓజీ చిత్రం విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం టాలీవుడ్ హిస్టరీలోనే మరో మైలురాయిగా నిలిచింది. ఈ సక్సెస్ వేవ్ ఇంకా కొనసాగుతుండగానే పవన్ కొత్త సినిమా గురించి హాట్ న్యూస్ ఒకటి ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ త్వరలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించనున్నారని వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారట.
ఇదే నిజమైతే, ఇది పవన్ అభిమానులకు పండగే అనే చెప్పాలి. ఇప్పటికే ఈ ముగ్గురు వేరు వేరు సినిమాలతో టాలీవుడ్‌ను కుదిపేశారు. ఇప్పుడు ఒక్కటైతే సరికొత్త రికార్డులు నమోదు కావడం ఖాయం అంటున్నారు. ‘ఓజీ’ సినిమాతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఈ మూవీ విడుదలైన 11 రోజుల్లోనే రూ. 300 కోట్ల క్లబ్లో చేరి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ విజయం అనంతరం, పవన్ సినిమాలపై ఉత్కంఠ మరింత పెరిగింది. ఇలాంటి టైమ్‌లో అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌పై గుసగుసలు మొదలయ్యాయి. అనిల్ రావిపూడి ..కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు హ్యూమర్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
పటాస్, సుప్రీమ్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం వంటి హిట్లతో తన మార్క్ సెట్ చేశాడు. ఈ స్టైల్ పవన్ పవర్ఫుల్ ఇమేజ్‌కి పర్ఫెక్ట్ గా సూటవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాతే పవన్ ప్రాజెక్ట్‌పై పూర్తిగా ఫోకస్ పెట్టనున్నారు.ఇటీవల ఓజీ సక్సెస్ ఈవెంట్లో దిల్ రాజు వ్యాఖ్యలు ఇప్పుడు హైప్‌కు మరో కారణంగా మారాయి. పవన్ గారు ఎంత బిజీగా ఉన్నా, మా కోసం ఏడాదికి ఒక సినిమా అయినా చేయాలి అని అన్నారు.ఇది కేవలం కామెంట్ మాత్రమేనా? లేక రాబోయే ప్రాజెక్ట్‌కి పునాది వేయడమా? అనే చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో నడుస్తోంది.