మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరు అనే విషయం మనందరికి తెలిసిందే. అతని భార్య సౌజన్య శ్రీనివాస్ క్లాసికల్ డ్యాన్సర్ కొద్ది మందికే తెలుసు. పలు ప్రదర్శనలు ఇచ్చిన ఆమె తాజాగా ‘మీనాక్షి కళ్యాణం’ అనే శాస్త్రీయ నృత్య నాటక ప్రదర్శన ఇవ్వబోతున్నారు. ఈ నృత్య ప్రదర్శన డిసెంబర్ 2వ తేదీనే జరగాల్సి ఉంది. అయితే సౌజన్య బాబాయ్ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకస్మాత్తుగా మరణించడంతో ఈ నాట్య ప్రదర్శన వాయిదా పడింది.
సౌజన్య నాట్య ప్రదర్శన రేపు సాయత్రం 6 గంటల నుంచి శిల్పకళా వేదికలో జరగనుంది. దీనికి పసుమర్తి రామలింగ శాస్త్రి దర్శకత్వం వహించనున్నారు. హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ కలసి ఈ ఈవెంట్‌ను అందిస్తున్నాయి. కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ కార్యక్రమంపై పడింది.
గౌరవ అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి తనికెళ్ల భరణి, వసంత లక్ష్మీ నరసింహాచారి, త్రివిక్రమ్ శ్రీనివాస్, చుక్కపల్లి సురేష్, సతీష్ చంద్ర గుప్తా ఇతర ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. కాగా, ప్రముఖ గేయరచయిత సిరివెన్నల సీతారామశాస్త్రి సోదరుడి కూతురు సౌజన్యను త్రివిక్రమ్ పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు అనే విషయం మనందరికి తెలిసిందే.