Pavala Shyamala | తెలుగు సినీ పరిశ్రమలో 300కి పైగా చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పావలా శ్యామల ప్రస్తుతం తీవ్ర ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. సరైన ఆదాయం లేకపోవడం, ఆదుకునే వారు కరువవ్వడంతో ఆమె జీవితం పూర్తిగా దయనీయ స్థితికి చేరుకుంది. శ్యామలతో పాటు ఆమె కుమార్తె కూడా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ జీవనం సాగించలేని పరిస్థితిలో ఉన్నారు.గతంలో చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు పావలా శ్యామల కుటుంబానికి ఆర్థికసహాయం చేసినప్పటికీ, మళ్లీ పరిస్థితి యథావిధిగానే మారిపోయింది.
కొన్నాళ్లుగా వారు ఒక హోమ్‌లో నివసిస్తుండగా, ఆరోగ్య సమస్యలు మరింత పెరగడంతో కదల్లేని స్థితికి చేరుకున్నారు. మంచానికే పరిమితం కావడంతో హోమ్ నిర్వాహకులు సేవలందించలేమంటూ వారిని బయటకు పంపినట్లు తెలుస్తోంది. ఆదాయం లేక, ఆధారం లేక, పూర్తిగా నిరాశలో పావలా శ్యామల, ఆమె కుమార్తె ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించినట్లు సమాచారం. ఈ సమయంలో రోడ్డుపై అత్యంత దారుణ పరిస్థితిలో ఉన్న వారిని గమనించిన కార్ఖానా పోలీస్ స్టేషన్ సిబ్బంది, శ్యామలని గుర్తించి ఈ విషయాన్ని తిరుమలగిరి ఏసీపీ రమేష్ దృష్టికి తీసుకెల్లారు.
ఏసీపీ రమేష్ వెంటనే స్పందించి, పావలా శ్యామలతో పాటు ఆమె కుమార్తెను కార్ఖానా పరిధిలోని ఆర్కే ఫౌండేషన్ హెల్త్ కేర్ సెంటర్లో చేర్పించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ఫౌండర్ రామకృష్ణ, శ్యామల తల్లీకూతుళ్లకు ఆశ్రయం కల్పించి అన్ని సేవలు అందిస్తామని ప్రకటించారు. అనాథ వృద్ధులు ఎవరైనా ఉన్నా తమను సంప్రదించాలని కూడా ఆయన కోరారు.తినడానికి కూడా డబ్బులు లేక, గతంలో తనకు వచ్చిన అవార్డులను అమ్ముకునే పరిస్థితి వచ్చిందని పావలా శ్యామల కన్నీళ్లతో వెల్లడించిన విషయం తెలిసిందే. ఆమె పరిస్థితి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలకు పైగా ఆర్థిక సహాయం చేయగా, యంగ్ హీరోలు సాయి ధరమ్ తేజ్, ఆకాశ్ పూరి తదితరులు కూడా ముందుకు వచ్చి సహాయం అందించారు. అయినప్పటికీ, ప్రస్తుతం ఆమె పరిస్థితి మళ్లీ అత్యంత దారుణంగా మారింది.