Patang Movie | సికింద్రాబాద్ బస్తీ నేపథ్యం మరియు గాలిపటాల పోటీల ఇతివృత్తంతో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘పతంగ్’ ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. గతేడాది డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించి ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో సందడి చేసేందుకు ముస్తాబవుతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక సన్నెక్స్ట్ ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకోగా.. జనవరి 30 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పణలో ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ముక్కోణపు ప్రేమకథను వినోదాత్మకంగా వెండితెరపై ఆవిష్కరించింది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, వంశీ పూజిత్, ప్రణవ్ కౌశిక్ ప్రధాన పాత్రల్లో నటించగా, స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరియు ఎస్.పి. చరణ్ కీలక పాత్రలు పోషించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విస్కీ (వంశీ పూజిత్), అరుణ్ (ప్రణవ్ కౌశిక్) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. దాదాపు 12 ఏళ్ల వీరి స్నేహంలోకి ఐశ్వర్య (ప్రీతి పగడాల) అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. ఐశ్వర్య పట్ల ఇద్దరికీ ఇష్టం ఏర్పడడంతో వీరి స్నేహంలో చిన్నపాటి గ్యాప్ వస్తుంది. ఈ ముక్కోణపు ప్రేమకథకు ఒక స్పష్టమైన ముగింపుని ఇవ్వడం కోసం, హీరోలు ఇద్దరూ పతంగుల పోటీని ఎంచుకుంటారు. మరి ఈ పోటీలో ఎవరు గెలిచారు? చివరికి ఐశ్వర్య ఎవరిని వరించింది? అనేదే ఈ సినిమా కథ.