Pariyerum Perumal Movie | ఈ మధ్య బాలీవుడ్లో రీమేక్‌ల సందడి ఎక్కువైపోయింది. సౌత్ సినిమాలను కాస్త అటు ఇటుగా మార్చి బాలీవుడ్లో రీమేక్ చేసి హిట్లు కొడుతున్నారు. పైగా ఇప్పుడు బాలీవుడ్లో పరిస్థితి మహా దారుణంగా తయారైంది. ఈ ఏడాది ‘పఠాన్’ తప్పితే చెప్పుకోదగ్గ స్థాయిలో బాలీవుడ్లో మరో హిట్టే లేదు. దాంతో కొత్త కథల జోలికి వెళ్లకుండా.. ఆల్రెడీ హిట్టయిన సినిమాలనే రీమేక్‌లు చేసి సేఫ్ అవ్వాలనే ప్లాన్ చేస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. కాగా తాజాగా బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ కన్ను ఓ తమిళ బ్లాక్‌బస్టర్ సినిమాపై పడింది.
ఇంతకీ ఆ తమిళ సినిమా ఏంటా అని అనుకుంటున్నారా? ఆ సినిమా పేరు పరియేరుమ్ పెరుమాళ్. కర్ణన్ సినిమాతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్ మారి సెల్వరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. కాస్ట్ సిస్టమ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. అప్పర్ కాస్ట్ వాళ్లు లోయర్ కాస్ట్ వాళ్లను ఎలా చూస్తారు అనే కథతో ఈ సినిమా ఉంటుంది. ఇలాంటి కథలు గతంలో నుంచి వస్తున్నవే. కానీ మారి సెల్వరాజ్ సరికొత్త కథనంతో ఈ సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు. కాగా ఇప్పుడు ఈ సినిమా రీమేక్ హక్కులను కరణ్ జోహర్ దక్కించుకున్నాడు.
రీమేక్‌లో సిద్దాంత్ చతుర్వేది, త్రిప్తీ డిమ్రీ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘ధడక్-2’ టైటిల్‌తో రూపొందించనున్నారట. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే ఏడాది ద్వితియార్థంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ మధ్య రీమేక్‌లు కూడా బాలీవుడ్‌ను కాపాడలేకపోతున్నాయి. షెహజాదా, సెల్ఫీ, భోళా వంటి రీమేక్ సినిమాలు బాలీవుడ్ నిర్మాతలకు కోట్లలో నష్టాలు తెచ్చిపెట్టాయి. మరీ ఈ సినిమా కరణ్ జోహర్‌కు కలిసొస్తుందా? లేదా? అనేది చూడాలి.