Parineeti-Raghav Chadha | బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ (AAP MP) రాఘవ్ చద్దా (Raghav Chadha) వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొన్ని గంటల్లోనే వీరు వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఆదివారం వీరి వివాహం జరగనుండగా. ఈ పెళ్లి తంతుకు రాజస్థాన్ ఉదయ్‌పూర్ (Udaipur)లోని లీలా ప్యాలెస్ (Leela Palace) వేదిక కాబోతోంది. ఈ నేపథ్యంలో పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు కూడా పరిణీతి, రాఘవల పెళ్లి అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ పెళ్లికి హాజరయ్యేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం ఉదయపూర్ చేరుకున్నారు. రాఘవ్ చద్దా తల్లిదండ్రులు వారిని ఆప్యాయంగా స్వాగతించారు. ఇక వీరిద్దరూ ఉదయపూర్ విమానాశ్రయానికి చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ పెళ్లికి 200 మందికిపైగా అతిథులు, 50 మందికిపైగా వీవీఐపీలు హాజరుకానున్నట్లు సమాచారం. దీంతో వీవీఐపీ అతిథుల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఇంటెలిజెన్స్ అధికారులు అతిథుల కోసం బుక్ చేసిన హోటళ్లలో తనిఖీలు చేపట్టినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. రెండు నెలల క్రితమే రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా ఉదయ్‌పూర్ వెళ్లి హోటళ్లను పరిశీలించినట్లు తెలిసింది. ఈ వివాహానికి ఢిల్లీ సీఎం, పంజాబ్ సీఎం సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవాకాశం ఉంది. పరిణీతి చోప్రా కజిన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ కూడా ఈ వేడుకకు విచ్చేయనున్నట్లు తెలుస్తోంది.