హీరోయిన్గా కొనసాగాలంటే క్వాలిఫికేషన్ కేవలం నటన మాత్రమే కాదు.. అందం, నాజూకైన శరీరం కూడా. ఈ రెండు లేకపోతే హీరోయిన్గా ఎక్కువకాలం మనలేరు. ప్రస్తుతం ట్రెండ్ అలా ఉంది. అందుకే కథానాయికలు గంటల తరబడి జిమ్ములోనే కాలం గడిపేస్తుంటారు. పాత్ర కోసం బరువు పెరగాల్సొస్తే.. ఇప్పటి హీరోయన్లకు అది నిజంగా సాహసమే. అవసరమైతే సినిమానైనా రిజక్ట్ చేస్తారుగానీ, కష్టపడి కరిగించుకున్న శరీరాన్ని మాత్రం పెంచుకోరు. కానీ కొందరుంటారు. పాత్రల కోసమే బతుకుతుంటారు. దానికోసం ఎంతటి సాహసాన్నైనా చేస్తారు. ఆకోవలోకే వస్తుంది పరిణితి చోప్రా.
ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘అమర్‌సింగ్ చంకీల’ సినిమాకోసం ఏకంగా 16 కేజీలు బరువు పెరిగింది పరిణితి. ఈ సినిమా విజయానందంలో ఉన్న ఆమె తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘కెరీర్ మొదట్లో సరైన కథలు ఎంచుకోలేకపోయా. ప్రేక్షకులు నానుంచి వైవిద్యాన్ని కోరుకుంటున్నారని తర్వాత అర్థమైంది. అందుకే సవాళ్లతో కూడిన పాత్రలను ఎంచుకోవడం మొదలుపెట్టా. ‘అమర్‌సింగ్ చంకీల’కోసం 16కేజీలు బరువు పెరిగా. ఈ రోజుల్లో ఇలాంటి సాహసం చేసే కథానాయికలు తక్కువమందే ఉంటారు. ఇందులో గాయని అమర్‌జోత్ కౌర్‌గా నటించాను. ఆ పాత్రకోసం లైవ్‌లో ఎలా పాడాలో రెండేళ్లు శిక్షణ తీసుకున్నా. నా కష్టానికి తగ్గ ఫలితమే ఈ విజయం’ అంటూ ఆనందం వెలిబుచ్చింది పరిణితి.