Atal Bihari Vajpayee Biopic | ఈ మధ్య కాలంలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తుంది. తెలిసిన కథలనే ఆసక్తికర కథనంతో తెరకెక్కిస్తే బయోపిక్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే అన్ని బయోపిక్‌లు బాక్సాఫీస్ దగ్గర హిట్లు కావడం లేదు. ఎంత పెద్ద సెలబ్రిటీ బయోపిక్ అయినప్పటికీ, కథ ఆసక్తికరంగా ఉండి కేవలం నిజాలను మాత్రమే చూపిస్తేనే బయోపిక్‌లు హిట్ అవుతున్నాయి. ఇప్పటికే ఇండియన్ సినీ సెలబ్రెటీలు, స్పోర్ట్స్ పర్సన్స్, రాజకీయ నాయకుల ఇలా చాల మంది బయోపిక్‌లు తెరకెక్కాయి. అయితే అందులో హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే భారత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ బయోపిక్ తెరకెక్కనుంది. రవి జాదవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే సినిమా ప్రకటించినప్పుడు చిత్రబృందం వాజ్‌పేయీ పాత్రలో ఎవరు నటిస్తారు అనేది క్లారిటీ ఇవ్వలేదు. కాగా తాజాగా ఈ సినిమా కథానాయికుడిని మేకర్స్ ప్రకటించారు. వాజ్‌పేయీ పాత్రలో మిర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠీ నటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
ఈ సందర్భంగా వాజ్‌పేయీ పాత్రలో నటించడంపై పంకజ్ త్రిపాఠి మాట్లాడుతూ ‘వాజ్‌పేయీ కేవలం రాజకీయవేత్త మాత్రమే కాదు.. మంచి మానవతావాది, రచయిత, కవి కూడా. ఇలాంటి గొప్ప నాయకుడి పాత్రలో నటించడానికి అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నట్లు’ పంకజ్ తెలిపాడు. ఈ చిత్రాన్ని వాజ్‌పేయీ 99వ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది క్రిస్మస్కు రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.
‘గ్యాంగ్ ఆఫ్ వసీపూర్’, ‘మిర్జాపూర్’ వంటి సిరీస్‌లతో బాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు పంకజ్ త్రిపాఠీ. తెలుగులో పంకజ్ ‘దూసుకెళ్తా’ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.