న్యూఢిల్లీ: బీఆర్ చోప్రా తీసిన మహాభారత్ సీరియల్లో కర్ణుడి పాత్ర పోషించిన ప్రఖ్యాత నటుడు, టీవీ స్టార్ పంకజ్ ధీర్(Pankaj Dheer) ఇక లేరు. ఆయన వయసు 68 ఏళ్లు. క్యాన్సర్‌తో పంకజ్ బాధపడుతున్నట్లు తెలిసింది. ఫ్యాంటసీ డ్రామా చంద్రకాంతలో శివదత్తు చక్రవర్తి పాత్రను ఆయన పోషించారు. క్యాన్సర్ వల్ల ఇవాళ ఉదయం ఆయన మృతిచెందినట్లు తెలిపారు. గత కొన్ని నెలల నుంచి ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు ప్రొడ్యూసర్ అశోక్ పండిట్ తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం పంకజ్ ధీర్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
పంకజ్ ధీర్ది పంజాబ్. 1980 దశకంలో ఆయన నటుడిగా కెరీర్ స్టార్ట్ చేశారు. చాలా వరకు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించేవారు. అయితే దూరదర్శన్ టీవీలో 1988లో ప్రసారం అయిన మహాభారత్ సీరియల్లో కర్ణుడి పాత్రను ఆయన నోషించారు. ఆ సీరియల్ తర్వాత ఆయన పాపులార్టీ చాలా పెరిగిపోయింది. ఆ తర్వాత సడక్, సనమ్ బెవఫా, ఆశిక్ అవారా లాంటి చిత్రాల్లో నటించాడు.
1994 నుంచి 1996 వరకు చంద్రకాంత టీవీ సీరియల్లో నటించారు. 1888లో రాసిన దేవకి నందన్ ఖత్రి పుస్తకం ఆధారంగా ఆ సీరియల్‌ను తీశారు. దాంట్లో శివదత్తు పాత్రను పోషించారు. బాబీ డియోల్ నటించిన సోల్జర్, షారూక్ ఖాన్ నటించిన బాద్షా, అక్షయ్ కుమార్ నటించిన అందాజ్, అజయ్ దేవన్ నటించిన జమీన, టార్జన్ చిత్రాల్లోనూ పంకజ్ ధీర్ నటించారు.
తీన్ బహురాణియాన్, రాజా కీ ఆయేగీ బరాత్, ససురాల్ సిమర్ కా లాంటి టీవీ షోల్లోనూ కూడా ధీర్ నటించారు. భార్య అనితా ధీర్, కుమారుడు నికితిన్ ధీర్ ఉన్నారు.